రామాయణ గాథను త్రీ-డీలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలన్నది అల్లు అరవింద్ చిరకాల వాంఛ. మధు మంతెన, నమిత్ మల్హోత్రాతో కలిసి నిర్మించాలని ఐదేళ్ళక్రితమే అల్లు అరవింద్ ప్లాన్ చేశారు. మూడు భాషల్లో విజువల్ వండర్ గా మూడు భాషల్లో తీయాలన్నది అరవింద్ ఆలోచన. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మనసు మార్చుకున్న అల్లు అరవింద్, మధు మంతెనతో కలిసి ‘మహాభారతం’ వెబ్ సీరిస్ ను ప్లాన్ చేస్తున్నారు. డి23 ఎక్స్ ప్లో లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
గతంలో భారతదేశంలో అమ్మమ్మ, తాతయ్యల ద్వారా మహాభారతాన్ని వినేవారని, కానీ ఇప్పుడు లక్షలాది మంది బాలలకు ఆ గొప్ప పురాణ గాథను వినే ఆస్కారం లేకుండా పోయిందని, ఆ లోటును తీర్చడం కోసమే ఈ వెబ్ సీరిస్ ను విజువల్ ఫీస్ట్ లా తాము రూపొందించబోతున్నామని మధు మంతెన తెలిపారు. ఈ వెబ్ సీరిస్ వచ్చే యేడాది వీక్షకుల ముందుకు వస్తుందని, ఓ సరికొత్త అనుభూతిని ఇది అందిస్తుందని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ హెడ్ కంటెంట్ గౌరవ్ బెనర్జీ తెలిపారు. అల్లు ఎంటర్ టైన్ మెంట్స్, మైథోవర్స్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ వెబ్ సీరిస్ ను నిర్మించబోతున్నాయి. దీనికి సంబంధించిన ఆర్ట్ వర్క్ ను కూడా ఈ ఎక్స్ పోలో విడుదల చేశారు.