దర్శక ధీరుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’లో ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీయార్ ‘రివోల్ట్ ఆఫ్ భీమ్’ సాంగ్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. దానికి ఇప్పుడు ‘రైజ్ ఆఫ్ రామ్’ సాంగ్ తోడైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోషిస్తున్న రామ్ క్యారెక్టర్ ను తెలియచేస్తూ సాగే ఈ పాటను శివశక్తి దత్తా సంస్కృతంలో రాయడం విశేషం. ‘రామం రాఘవం… రణధీరం రాజసం’ అంటూ సాగే ఈ పాటను విజయ్ ప్రకాశ్, చందన బాల కళ్యాణ్, చారు హరిహరన్ పాడారు. దీనికి మరికొందరు యువ గాయనీ గాయకులు అడిషనల్ వాయిస్ ఇచ్చారు… విశేషం ఏమంటే… వీరందరితో చిత్రీకరించిన సాంగ్ మేకింగ్ వీడియో మరో లెవల్ లో ఉంది. డిసెంబర్ 31 రాత్రి మెగా అభిమానులంతా పండగ చేసుకునేలా దీనిని ఎం.ఎం. కీరవాణి స్వరపరిచారు. అంతే కాదు… హై ఓల్టేజ్ లో దీనిని సింగర్స్ తో పాడించారు. ఇండియన్ క్లాసిక్, వెస్ట్రన్ ఫ్యూజన్ తో సాగే ఈ పాట సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. కొద్ది సేపటి క్రితం వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’లోని ‘లాలా భీమ్లా’ డీజే వర్షన్… ఇప్పుడు ‘ట్రిపుల్ ఆర్’లోని చెర్రీ ‘రైజ్ ఆఫ్ రామ్’ సాంగ్ ఒక దానితో ఒకటి పోటీ పడేలా ఉన్నాయి. మరి ఈ సోషల్ మీడియా వార్ లో బాబాయ్ – అబ్బాయ్ లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే… సంక్రాంతి కానుకగా జనవరి 7న రాబోతున్న ‘ట్రిపుల్ ఆర్’ ప్రమోషన్స్ పీక్స్ కు చేరుకుంటున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల కాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీని అదే స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. సినిమా షూటింగ్ ను ఎంత పక్కా ప్లానింగ్ తో చేశారో, ఇప్పుడు రిలీజ్ ముందు పబ్లిసిటీనే అలానే చేస్తున్నారు. ఒకదాని వెనుక ఒకటిగా విడుదలవుతున్న ఈ పాటలు ఆ ప్రచార హోరుకు అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా ఉన్నాయి. అంచనాలు అంబరాన్ని తాకుతున్నా… వాటిని ఖచ్చితంగా అందుకోగలమని ‘ట్రిపుల్ ఆర్’ చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.