‘ఇస్మార్ట్ శంకర్’తో లవర్ బాయ్ నుంచి ఉస్తాద్‌గా అవతరించినప్పటి నుంచీ రామ్ పోతినేని తన స్పీడ్ పెంచాడు. వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పటికే లింగుసామీ దర్శకత్వంలో ‘ద వారియర్’ అనే బైలింగ్వల్ కంప్లీట్ చేసిన ఈ ఎనర్జిటిక్ హీరోగా.. త్వరలోనే బోయపాటి శ్రీనుతో సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా మరో సినిమాకి కూడా ఇతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
సినీ వర్గాల్లో వినిపిస్తోన్న వార్తల ప్రకారం.. దర్శకుడు హరీశ్ శంకర్‌తో రామ్ ఓ సినిమాకి ఒప్పందం కుదుర్చుకున్నాడట! రీసెంట్‌గానే ఈ ఇద్దరి మధ్య కథా చర్చలు నడిచాయని, స్టోరీ తనకు నచ్చడంతో రామ్ పచ్చజెండా ఊపేశాడని అంటున్నారు. నిజానికి.. హరీశ్ శంకర్, పవన్ కళ్యాణ్‌ల ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా ఈపాటికే పట్టాలెక్కాల్సింది. కానీ, ఆయన రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉండటం వల్ల ఆ ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వస్తోంది. పవన్ ఖాళీ అవ్వడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుందని తెలుసుకున్న హరీశ్.. ఆయన ఫ్రీ అయ్యేలోపు ఓ సినిమా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడట!
ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌తోనూ హరీశ్ చర్చలు జరిపినట్టు వార్తలొచ్చాయి. వీరి కాంబోలో వచ్చిన ‘డీజే’ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బన్నీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసినప్పుడు.. వీరి కలయికలో కచ్ఛితంగా సినిమా ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది. కానీ, ఇప్పుడు సీన్‌లోకి రామ్ పోతినేని వచ్చేశాడు. మరి.. బన్నీ రిజెక్ట్ చేశాడని రామ్‌తో ప్రాజెక్ట్‌కి హరీశ్ ఫిక్సయ్యాడా? లేక బన్నీతో కలయిక కేవలం ఫార్మాలిటీ కోసమా? ఇంతకీ రామ్‌తో నిజంగానే ఓ ప్రాజెక్ట్‌కి హరీశ్ కమిట్ అయ్యాడా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే, కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే!