Murali Raju: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనమామ మురళీ రాజు మంతెన మంగళవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ భీమవరంకు చెందిన మురళీ రాజు గతంలో సినిమా సంబంధ వ్యాపారాలను చేశారు. ఆయన స్వయంగా ‘కార్తీక్’ అనే సినిమాను తెరకెక్కించారు. ఆయన కుమారుడు మధు మంతెన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలను నిర్మించారు. మురళీ రాజు మరణవార్త తెలియగానే అల్లు అరవింద్, అల్లు అర్జున్, నిర్మాత బన్నీ వాసు తదితరులు మధురానగర్ లోని మురళి రాజు నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. ముంబై నుండి ఆమీర్ ఖాన్ సైతం హైదరాబాద్ వచ్చి నివాళులు అర్పించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదిలా ఉంటే… రామ్ గోపాల్ వర్మ దర్శకత్వ శాఖలో ఎక్కడా పనిచేయలేదని చాలామంది అనుకుంటారు. కానీ చిన్నప్పటి నుండి సినిమా రంగంతో వర్మకు సంబంధం ఉంది. ఆయన తండ్రి కృష్ణంరాజు సౌండ్ ఇంజనీయర్. ఎక్కువగా అక్కినేని నాగేశ్వరరావు చిత్రాలకు పనిచేశారు. అలానే రామ్ గోపాల్ వర్మలోని సినిమాపై ఆసక్తిని తొలుత కనిపెట్టి, ప్రోత్సహించిన వ్యక్తి ఆయన మేనమామ మంతెన మురళీ రాజే. స్వయాన వర్మ తల్లి సోదరుడైన మురళీరాజు… ప్రపంచ సినిమాను అధ్యయనం చేశారు. ఆయనకు బాగా నచ్చిన చిత్రం మార్లన్ బ్రాండో నటించిన ‘గాడ్ ఫాదర్’. ఈ సినిమాపై ఆయన పలు కోణాల్లో విశ్లేషణలు చేసేవారు. ఆ ప్రభావం రామ్ గోపాల్ వర్మపై పడింది. అందుకే వర్మ తొలి చిత్రాలను పరిశీలిస్తే… ‘గాడ్ ఫాదర్’ ఛాయలు వాటిల్లో కనిపిస్తూనే ఉంటాయి. వర్మ ఇంజనీరింగ్ చదువును అర్థాంతరంగా వదిలివేస్తే… అతనిలో ఓ దర్శకుడు దాగున్నాడని ఇంట్లో వాళ్ళకు నచ్చచెప్పి, అన్నపూర్ణ స్టూడియోస్ లో తొలుత షూటింగ్స్ అబ్జర్వ్ చేయమని ఉపదేశించింది మురళీ రాజే. ఆ తర్వాత ఇంగ్లీష్ చిత్రం ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ స్ఫూర్తితో రూపొందిన ‘రావుగారిల్లు’ చిత్రానికి దర్శకుడు తరణీరావు వద్ద కో-డైరెక్టర్ గా వర్మ పనిచేశాడు. అలానే ఏయన్నార్ హీరోగా రూపొందిన ‘సంగీత సమ్రాట్’కు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు అసోసియేట్ గా ఉన్నాడు. ఆ తర్వాతే వర్మ ‘శివ’ చిత్రం స్క్రిప్ట్ తయారు చేసుకుని దర్శకుడు కావాలన్న తన అభిలాషతో ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ తతంగం అంతటి వెనుక తన మేనమామ మురళీ రాజు ప్రభావం ఉందని రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో వర్మ స్వయంగా తెలిపాడు. మురళీ రాజుకు ఇద్దరు పిల్లలు. కొడుకు మధు. నిర్మాతగా కొనసాగుతున్నాడు. కుమార్తె అంబిక.