Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఈ మధ్యనే గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ ఫంక్షన్ లో మెరిసి అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చాడు. అక్కడ ఇంటర్నేషనల్ లెవల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ముఖయంగా చిరంజీవికి తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చాడు. “నాన్న 41 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయనను చూసి నేను చాలా నేర్చుకున్నాను. నటుడిగా కొన్ని కొన్ని విషయాల్లో ఆయన చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. ముఖ్యంగా బాడీ ఫిట్ నెస్ విషయంలో అస్సలు తగ్గరు. ఒకరోజు నేను డైనింగ్ టేబుల్ వద్ద తింటుంటే.. ఏంటీ చరణ్ కొంచెం తగ్గినట్లు కనిపిస్తున్నావు.. అస్సలు తినడం లేదా..? అని అడిగారు. నేను కూడా అది నిజమే అనుకోని అవును డాడీ అని తలూపాను.. అంతే వెంటనే ఆయన.. ఇడియట్.. బరువు పెరిగావు.. కనిపించడం లేదా..? జిమ్ సరిగ్గా చేస్తున్నావా..? రేపటి నుంచి ఇంకొంచెం గట్టిగా చెయ్ అని అనేశారు. ఇక అక్కడే ఉన్న ఉపాసన ఆ మాటలు విని.. అదేంటీ .. మిమ్మల్ని అలా అవమానిస్తున్నారు అని అడిగింది. అది అవమానం కాదు.. ఇద్దరు నటుల మధ్య డిస్కషన్ అలాగే ఉంటుంది అని ఉపాసనకు చెప్పాను.
చిన్నతనం నుంచి నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఈ విషయం డాడీకి కూడా తెలుసు. అయితే ఎలా పడితే అలా పరిచయం చేయడం ఆయనకు ఇష్టం లేదు. ముందు నేను చదువు పూర్తి చేసి, డిగ్రీ పట్టా అందుకున్నాకా యాక్టింగ్ లోకి రావాలని కోరుకునేవారు. కానీ, మనకేమో చదువు సరిగ్గా రాలేదు. దీంతో మా డీన్.. డాడీకి ఫోన్ చేసి అతనికి ఏది ఇష్టమైతే అది చేయనివ్వండి.. మాకెందుకు ఇదంతా అని అనగానే ఆయనకు అర్థమైంది. అప్పుడు కాలేజ్ నుంచి డైరెక్ట్ గా యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యాను” అని చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం తన చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయని, త్వరలోనే అన్ని సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలిపాడు.