Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. శంకర్ సినిమా అంటే ఎంత వర్క్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి సినిమా అయినా ఏళ్ళు పట్టినా రిలీజ్ అవుతుంది అనే నమ్మకం ఉంటుంది. కానీ, శంకర్ సినిమాకు ఆ నమ్మకం కూడా లేదు. అప్పుడెప్పుడో మొదలైన ఈ సినిమా సగం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకోలేదు. మధ్యలో శంకర్.. ఇండియన్ 2 పై ఫోకస్ చేశాడు. దీంతో చరణ్.. బుచ్చిబాబు సినిమాపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తరువాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC16 రెడీగా ఉన్న విషయం తెల్సిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక ఈ రెండు సినిమాలే కాకుండా చరణ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలల క్రితం చరణ్ .. ముంబైకు వెళ్లిన విషయం తెల్సిందే. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఆఫీస్ లో చరణ్ కనిపించడంతో.. చరణ్ బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలను నిజం అవుతున్నట్లు సమాచారం. సంజయ్ లీలా భన్సాలీ కథకు చరణ్ ఓకే చెప్పాడని, మూడు రోజుల క్రితమే సైన్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇక సంజయ్ లీలా భన్సాలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుడిగా ఆయనకు ఎంతో పేరుంది. ప్రస్తుతం ఆయన హీరామండీ అనే నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ ను తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే వీరి కాంబో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక బాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ పేరు మారుమ్రోగిపోతుంది. ఇక ఈ సినిమాతో రికార్డులు బద్దలు అవ్వడం ఖాయమే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.