Peddi: నైజాంలో రామ్ చరణ్ ‘పెద్ది’కి బిగ్ షాక్

Peddi

Peddi

రామ్ చరణ్ తేజ, ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 4వ తేదీన వరల్డ్ వైడ్ రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ సినిమాకి, టాలీవుడ్‌లో అత్యంత కీలకమైన ప్రాంతంగా భావించే తెలంగాణ నైజాం మార్కెట్‌లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

వాస్తవానికి వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కే పాన్ ఇండియా సినిమాలకు, అలాగే తెలుగు భారీ బడ్జెట్ సినిమాలకు మొదటి వారం లేదా పది రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేలా ప్రభుత్వాలు స్పెషల్ జీవోలు ఇవ్వడం సాధారణం. అయితే ‘పెద్ది’కి కూడా అలా భారీగా రేట్లు పెంచుకునే అవకాశం ప్రభుత్వం ఇస్తుందని అందరూ ఆశించారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం జీవో జారీ చేసినా సరే, నైజాం ఎగ్జిబిటర్లు మాత్రం ఒక షాకింగ్ విషయం బయటపెట్టారు.

ఒకవేళ ప్రభుత్వం స్పెషల్ టికెట్ రేట్లకు అనుమతిస్తూ జీవో జారీ చేసినా సరే, తాము మాత్రం ఆ పెంచిన ధరలకు సినిమా ప్రదర్శించేది లేదని, ఇప్పుడున్న సాధారణ ధరలకు మాత్రమే సినిమా ఆడిస్తామని కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించారు. ఈరోజు ఏర్పాటు చేసిన ఎగ్జిబిటర్ల సమావేశంలో ఎగ్జిబిటర్ల తరపున మాట్లాడుతూ దిల్ రాజు సోదరుడు శిరీష్ ఈ మేరకు కామెంట్ చేశారు.

నిజానికి ప్రస్తుతానికి తెలంగాణలో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లకు పర్సంటేజీ విధానమే ఇవ్వాలని, రెంట్ విధానం ఇక వద్దని కొంతమంది ఎగ్జిబిటర్లు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఈ మేరకు శిరీష్ మాట్లాడారు. కానీ ఇలా గనుక టికెట్ ధరలు పెంచకుండా నైజాంలో ప్రదర్శిస్తే, కలెక్షన్స్ మీద గట్టిగానే ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పొచ్చు.