సర్కారు వారి పాటతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. తన తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే! ఆ తర్వాత ఆయన దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఓ అడ్వెంచరస్ యాక్షన్ త్రిల్లర్ (SSMB29) చేయనున్నాడు. ఆర్ఆర్ఆర్‌తో జక్కన్న సూపర్ బ్లాక్‌బస్టర్ అందుకోవడం, మహేశ్ బాబుకీ జాతీయంగా మంచి క్రేజ్ ఉండడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు మించే ఈ సినిమాని తెరకెక్కించేందుకు జక్కన్న ప్రణాళికలు రచిస్తున్నాడని వార్తలొస్తున్నాయి.
నిజానికి.. ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉంది. అయినప్పటికీ, ఇప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి రోజుకో క్రేజీ న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ చిత్రం కోసం ఇద్దరు క్రేజీ స్టార్స్‌ను విలన్ పాత్రల కోసం రంగంలోకి దింపనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకరు.. తమిళ స్టార్ హీరో సూర్య సోదరుడు కార్తీ కాగా, మరొకరు బాలీవుడ్ నటుడని టాక్ వినిపిస్తోంది. అయితే, ఆ బాలీవుడ్ నటుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ఆయా ఇండస్ట్రీలలో మార్కెట్ కోసమే జక్కన్న ఈ మాస్టర్ ప్లాన్‌ని తెరతీసినట్టు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలోనూ జక్కన్న అదే స్ట్రాటజీ ఫాలో అయ్యాడు. ఒక కీలక పాత్రలో సముద్రఖనిని, అలాగే బాలీవుడ్ నుంచి ఇద్దరు స్టార్స్‌ని (ఆలియా భట్, అజయ్ దేవగణ్) తీసుకొచ్చాడు. అయితే.. మహేశ్ సినిమాపై వస్తోన్న వార్తల్లో ఎంతవరకు నిజముందో ఇంకా తెలియాల్సి ఉంది.