ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప’ థియేటర్లలో డిసెంబర్ 17న విడుదలైంది. ఈ చిత్రం దక్షిణాది భాషల్లో జనవరి 7న ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. విశేషం ఏమంటే… థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసిన జనం ఓటీటీలో మరోసారి చూశారు. అంతేకాదు… ఓటీటీలో తొలిసారి చూసిన వారు మరోసారి థియేటర్లకు వెళ్ళీ చూస్తున్నారు.
ఫలితంగా శని, ఆదివారాల్లో పలు చోట్ల ఈ సినిమా కలెక్షన్లు పెరిగినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే… తెలుగుతో పాటు హిందీలోనూ థియేటర్లలో ఒకే రోజున విడుదలైంది ‘పుష్ప’ సినిమా. అయితే ఓటీటీలో మాత్రం ఈ నెల 7న హిందీ వర్షన్ ప్రసారం కాలేదు. దానిని ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రసారం చేయబోతున్నట్టు అమెజాన్ ప్రైమ్ సంస్థ తెలిపింది.