పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ కి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘బద్రి’ సినిమాకి.. ఇప్పటికీ యూత్ లో మంచి క్రేజ్ వుంది. ఆ తర్వాత కూడా ఇద్దరూ కలిసి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా చేశారు. ఇదిలావుంటే, వీరి నుంచి హ్యాట్రిక్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో చూస్తున్నారు. ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరిద్దరికి సమయం కలిసిరావడం లేదు. ప్రస్తుతం పవన్ వరుస సినిమాలతో, పాలిటిక్స్ తో బిజీగా ఉండగా.. పూరి ‘లైగర్’ ను పూర్తిచేసే పనిలో పడ్డాడు. అయితే ఈ సినిమా తర్వాత పూరి నెక్స్ట్ సినిమా పవన్ తోనే అనే కొత్త చర్చలు టాలీవుడ్ లో మొదలయ్యాయి. పూరి మూడు నెలల్లో సినిమా పూర్తి చేస్తా.. అనే హామీతో పవన్ తో చర్చలు జరిపినట్లుగా ప్రచారం జరుగుతోంది. పవన్ కు కూడా ఇప్పుడు కావలసింది వేగమే కాబట్టి.. ఈ సినిమా అనౌన్స్ మెంట్ కూడా త్వరలోనే రానుందని తెలుస్తోంది. అయితే ఇది ఇదివరకే అనుకున్న ‘జనగణమన’ సినిమా కాదని.. కొత్త కథతో రాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.