కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మృతి కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపింది. నిన్న ఉదయం ఆయన గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినప్పటికీ డాక్టర్ల ప్రయత్నాలు ఫలింకపోవడంతో పునీత్ తుదిశ్వాస విడిచారు. కర్ణాటక రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర శోకసంద్రంలో ఉంది. పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఆమె కూతురు వచ్చాకే చేయనున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి అతని కుమార్తె వందిత తిరిగి వచ్చిన తర్వాత అంతక్రియలు నిర్వహిస్తారు. పునీత్ దివంగత తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ సమాధి పక్కనే శనివారం పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో కర్మకాండలు నిర్వహిస్తామని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్. అశోక్ తెలిపారు.
Read Also : పునీత్ రాజ్ కుమార్ లాస్ట్ పిక్ వైరల్
నిన్న సాయంత్రం పునీత్ రాజ్‌కుమార్ భౌతికకాయాన్ని ముందుగా ఆయన నివాసానికి తీసుకెళ్లి, అనంతరం కంఠీరవ స్టేడియంకు తరలించి నివాళులర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన మృతికి సెలెబ్రిటీలతో పాటు అభిమానులు కూడా నివాళులు అర్పిస్తున్నారు. ఇక స్టేడియం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. దీంతో ఎలాంటి అనుకోని ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల బలమైన భద్రతా బలగాలను ప్రభుత్వం మోహరించింది. సమాచారం ప్రకారం దాదాపు 6000 మంది పోలీసులతో పాటు 40 KSRP ప్లాటూన్లు, సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్, RAF ని మోహరించారు. సీఎం బసవరాజ్ బొమ్మై సహా పలువురు ప్రముఖులు ఇప్పటికే పునీత్ పార్థీవదేహాన్ని సందర్శించిన విషయం తెలిసిందే.