పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్ రిలీజ్ కు రంగం సిద్ధమైంది. తెలంగాణలో ఈ మూవీ టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం ఇవ్వడంతో పాటు ఐదు షోస్ వేసుకోవడానికి అనుమతి కూడా ఇచ్చింది. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ అదనపు ఆటలు వేయడాన్ని, టిక్కెట్ రేట్లను పెంచి అమ్మడాన్ని ఎంత మాత్రం సహించమని రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్, ప్రముఖ నిర్మాత నట్టికుమార్ తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు గురువారం మీడియాతో మాట్లాడారు.
Read Also : Bigg Boss Ultimate : హోస్ట్ గా స్టార్ హీరో
‘కొంతమంది ప్రభుత్వ అధికారులు జీవో 35 ప్రకారమే టిక్కెట్లు విక్రయించాలని చెబుతున్నారని, నిజానికి అది కోర్టు ధిక్కారం కిందకు వస్తుంద’ని ప్రసన్న కుమార్ అన్నారు. ‘జీవో నంబర్ 35ను కోర్టు పక్కన పెట్టి, థియేటర్ల యాజమాన్యం సబ్ కలెక్టర్ల నుండి అనుమతి పొంది టిక్కెట్ రేట్లను పెంచి అమ్ముకోమని చెప్పిందని, ఆ రకంగా కొన్ని చిత్రాల ప్రదర్శన జరుగుతోందని, ఇప్పుడు కోర్టు పక్కన పెట్టిన ఆ పాత జీవోను అమలు చేయాలని అధికారులు చెప్పడం తీవ్ర పరిణామాలకు దారి తీసే ఆస్కారం ఉంద’ని ప్రసన్న కుమార్ చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం టిక్కెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతి ఇవ్వని పక్షంలో, గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో విడుదల చేసి జీవో 100ను అమలు చేయాలని, పెద్ద సినిమాలకు 75శాతం టిక్కెట్ రేట్లు పెంచి అమ్ముకోమని రాజశేఖర్ రెడ్డి కూడా చెప్పారని, ఆయన మాటకు విలువ ఇచ్చి జగన్ ప్రభుత్వం దాన్ని అమలు చేయాలని ఆయన కోరారు. సినిమా రంగంలోని కొందరు రాజకీయాలలో ఉండొచ్చని, అంతమాత్రాన సినిమాలను, రాజకీయాలను కలిపి చూడవద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్రసన్న అభ్యర్థించారు.
ఇదే విషయమై నిర్మాత నట్టికుమార్ మాట్లాడుతూ ”ప్రభుత్వం టిక్కెట్ రేట్ల క్రమబద్ధీకరణ నిమిత్తం ఓ కమిటీని వేసింది. దాని రిపోర్ట్ త్వరలోనే రానుంది. అయితే ఈ లోపుగా విడుదలయ్యే సినిమాలకు జీవో 35ను వర్తింపచేయాలని అధికారులు ఒత్తిడి చేయడం సబబు కాదు. సబ్ కలెక్టర్ల అనుమతితో టిక్కెట్ రేట్లను పెంచుకుని సినిమాలను ప్రదర్శించే హక్కు ఎగ్జిబిటర్లకు ఉంది. వారికి సహకరించాలని అధికారులను కోరుతున్నాం. స్థానిక అధికారులు థియేటర్ల యాజమాన్యలను ఇబ్బంది పెడుతున్న విషయం సీఎం జగన్ దృష్టికి వెళ్ళి ఉండదని అనుకుంటున్నాం. దయచేసి ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో కల్పించుకుని, ఎగ్జిబిటర్స్ కు న్యాయం జరిగేలా చూడాలి” అని అన్నారు.