ఎన్టీయార్ 30వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రాగానే ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నిజానికి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎన్టీయార్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సినిమా రావాల్సింది. కథానుగుణంగా ఈ చిత్రానికి ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పెట్టబోతున్నారనీ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎన్టీయార్ 30వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నట్టు తాజా ప్రకటన వెలువడింది. ఈ విషయమై నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ‘ఊహించని పరిస్థితుల కారణంగా తమ బ్యానర్ నుండి ఎన్టీఆర్ 30వ చిత్రం రావడం లేదని, అయితే ఎన్టీయార్ ప్రాజెక్ట్ పై అదే ఉత్సుకతతో ఉన్నామ’ని నాగవంశీ తెలిపారు. రాబోయే రోజుల్లో తమ కాంబినేషన్ రిపీట్ అవుతుందనే ఆశాభావాన్ని నాగవంశీ వ్యక్తం చేశారు. ఎన్టీయార్, కొరటాల శివ, కళ్యాణ్ రామ్, నిర్మాత సుధాకర్ లకు నాగవంశీ విషెస్ చెప్పారు. ఎన్టీయార్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని సంస్థ నిర్మించిన ‘అరవింద సమేత’ 2018 అక్టోబర్ లో విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.