ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 సినిమా చేస్తోన్న బాలయ్య.. దీని తర్వాత అనిల్ రావిపూడితో జత కట్టనున్న విషయం తెలిసిందే! ఈ సినిమాను సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్ళనున్నట్టు ఆల్రెడీ అనిల్ ఎఫ్3 ప్రమోషన్ కార్యక్రమాల్లో క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. ఈ సినిమా కథ ఓ తండ్రి – కూతురు మధ్య అల్లుకుని ఉంటుంది, కూతురు పాత్రలో శ్రీలీలా నటిస్తోందని వెల్లడించాడు కూడా! ఇందులో బాలయ్య 45 ఏళ్ళ తండ్రి పాత్రలో కనిపించనున్నట్టు తెలిపాడు.
అయితే, బాలయ్య సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారన్న విషయాన్ని అప్పుడు రివీల్ చేయలేదు. ఇప్పుడా మిస్టరీ రిలీజ్ అయినట్టు తెలుస్తోంది. సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోన్న వార్త ప్రకారం.. ఇందులో బాలయ్య సరసన కథానాయిక పాత్రలో ప్రియమణి నటించనుందట! అయితే, ఈమె కేవలం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో మాత్రమే కనిపించనున్నట్టు తెలిసింది. ఈ పాత్ర కోసం పలువురు హీరోయిన్లను పరిశీలించిన అనంతరం.. ప్రియమణి పర్ఫెక్ట్‌గా సూటవుతుందని, ఆమెనే ఫైనల్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈమె ఎంపికపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. బాలయ్య, ప్రియమణి ఇదివరకే మిత్రుడు సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు రెండోసారి వెండితెర షేర్ చేసుకోబోతున్నారు.
కాగా.. ఇందులో బాలయ్య క్యారెక్టరైజేషన్‌ను అనిల్ చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశాడట! తన మార్క్ కామెడీ, కమర్షియల్ అంశాలతో పాటు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ పుష్కలంగా ఉండేలా కథని సిద్ధం చేసినట్టు స్వయంగా అనిలే వెల్లడించాడు. ముఖ్యంగా.. తాను బాలయ్య ఇమేజ్‌కి తగినట్టు ఈ సినిమాని డిఫరెంట్‌గా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నానని అనిల్ చెప్పుకొచ్చాడు.