వరుస విజయాలతో ఊపు మీద ఉన్న ప్రియదర్శి, శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘సారంగపాణి జాతకం’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25, 2025న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియదర్శి మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్పిన విశేషాలు ఇవిగో:
‘కోర్ట్’ వంటి హిట్ తర్వాత ‘సారంగపాణి జాతకం’ ఎలా ఉంటుంది?
గత ఏడాది కథ విన్నప్పుడు ఈ సినిమా నన్ను ఆకట్టుకుంది. అనుకున్న దానికంటే ఆలస్యంగా ఇప్పుడు రిలీజ్ అవుతోంది. ‘కోర్ట్’ తర్వాత మళ్లీ ఇంత త్వరగా మంచి కథతో రావడం సంతోషంగా ఉంది. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఒత్తిడి లేదు.
మీరు నిజ జీవితంలో జాతకాలు నమ్ముతారా?
సినిమాలో చూపించినంత తీవ్రంగా కాదు, కానీ కొంత నమ్మకం ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఫలితాలు మన చేతిలో ఉండవు. మంచి సినిమా చేయడానికి ప్రయత్నిస్తాం, కానీ రిలీజ్ తేదీలు, థియేటర్లు వంటివి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే ఈ సినిమా ఇప్పుడు ఏప్రిల్ 25న వస్తోంది.
‘సారంగపాణి జాతకం’ ద్వారా ఏ సందేశం ఇవ్వబోతున్నారు?
జాతకాలను నమ్మాలా, వద్దా అని మేం చెప్పడం లేదు. ఒకరి నమ్మకాలను మరొకరిపై రుద్దడం వల్ల ఏం జరుగుతుందో ఈ కథ చూపిస్తుంది. ఏ ఒక్క వైపు నిలబడకుండా కథను చెప్పాం.
ఎమోషనల్ కథలపై మీకెందుకు ఆసక్తి?
సామాన్యుడి పాత్రలు ఎక్కువ మందిని ఆకర్షిస్తాయని నా నమ్మకం. ‘మల్లేశం’, ‘బలగం’, ‘కోర్ట్’, ‘సారంగపాణి’ వంటి కథలు మన చుట్టూ ఉన్నవాళ్ల జీవితాలను ప్రతిబింబిస్తాయి. ఈ చిత్రంలో జాతకాలను నమ్మే యువకుడి పాత్రలో నటించాను.
కామెడీ నుంచి ఫుల్-లెంగ్త్ ఎంటర్‌టైనర్‌లకు మారడం గురించి?
ప్రేక్షకులను నవ్వించడం ఇప్పుడు సవాల్. ఇంద్రగంటి గారి కామెడీ టైమింగ్ అద్భుతం. ఈ సినిమాలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నా.
మీ పాత్ర, యాస ఎలా ఉంటుంది?
ఇప్పటివరకు తెలంగాణ యాసలో ఎక్కువగా మాట్లాడాను, కానీ ఈ సినిమాలో ఆంధ్ర యాసలో కనిపిస్తాను. ఇంద్రగంటి గారి శైలిలో మాట్లాడేందుకు ప్రయత్నించాను. ఆయన నా కోసం ప్రత్యేక ట్రాక్, టైమింగ్ సెట్ చేశారు.
తణికెళ్ల భరణి, నరేష్ వంటి సీనియర్ నటులతో అనుభవం?
తణికెళ్ల భరణి, నరేష్, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వైవా హర్ష వంటి అద్భుత నటులతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. సీనియర్స్ అయినా సరదాగా, స్నేహపూరితంగా షూటింగ్‌లో పాల్గొన్నారు.
హీరోగా ఒత్తిడి ఉందా?
ఈ సినిమా కోసం ఇంద్రగంటి గారే ఎక్కువ కష్టపడ్డారు. నేను ఆయన చెప్పిన దాన్ని అనుసరించాను. ఒత్తిడి ఎప్పుడూ ఫీలవలేదు.
ఇండస్ట్రీలోకి రాకముందు జాతకం చూపించుకున్నారా?
అమ్మ జాతకం చూపిస్తే, నేను నటుడిని కాలేనని చెప్పారు. కానీ నేను ఆ మాటలను పట్టించుకోలేదు. నా పనిపై, నా మీద నమ్మకంతో ముందుకొచ్చాను.
‘సారంగపాణి జాతకం’ కథ ఆధారితమా, క్యారెక్టర్ ఆధారితమా?
‘కోర్ట్’ లాగా ఈ సినిమాలో కూడా అన్ని క్యారెక్టర్లు హైలైట్ అవుతాయి. ప్రేక్షకులు కంటెంట్ కోసమే వస్తారు. సినిమాలో విషయం ఉంటేనే ఆదరిస్తారు.
ఫ్లాప్‌లు వచ్చినప్పుడు స్వీయ విమర్శ చేస్తారా?
ఖచ్చితంగా. సినిమా ఫెయిల్ అయితే, నా తప్పులను సరిదిద్దుకుంటాను. తదుపరి సినిమాల్లో జాగ్రత్తగా ఉంటాను.
మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తారా?
మాస్ సినిమాలకు ఆదరణ ఉంది, కానీ నేను అన్ని రకాల కథలు చేయాలనుకుంటున్నాను. నాని గారు ‘దసరా’, ‘హాయ్ నాన్న’ చేసినట్టు, నేనూ వైవిధ్యమైన పాత్రలు పోషించాలని ఆశిస్తున్నా.
ఇంద్రగంటి గారి కథ విన్నప్పుడు మీ రియాక్షన్?
ఇంద్రగంటి గారితో ఫోటో దిగితే చాలనుకున్న నేను, ఆయన కథ చెప్పడం ఆశ్చర్యంగా అనిపించింది. కథ, టైటిల్ అద్భుతంగా అనిపించాయి. ఆయనతో తొలి రోజు షూటింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌తో అనుభవం?
శివలెంక గారు అద్భుతమైన నిర్మాత. ‘ఆదిత్య 369’ లాంటి చిత్రాలు తీసిన ఆయన, నన్ను కూడా గౌరవంగా ‘సర్’ అని పిలుస్తారు. ఆయన బ్యానర్‌లో పనిచేయడం నా అదృష్టం.
ప్రీమియర్‌లు, ప్రమోషన్స్ గురించి?
వైజాగ్‌లో ప్రమోషన్స్, ఈవెంట్‌లు చేస్తున్నాం. ప్రీమియర్‌లు కూడా ప్లాన్ చేశాం. సినిమా నచ్చితే థియేటర్‌లకు రమ్మని చెబుతున్నాం. అందరినీ నవ్విస్తూ, ఆనందపరిచే చిత్రమిది.
ప్రస్తుత ఆడియెన్స్ టేస్ట్ గురించి?
ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారు. ‘లక్కీ భాస్కర్’, ‘పుష్ప’ లాంటి చిత్రాల్లో సామాన్యుడు హీరోగా మారడం జనాలకు నచ్చుతోంది.
తదుపరి ప్రాజెక్టులు?
ఏషియన్ సినిమాస్‌లో ‘ప్రేమంటే’, గీతా ఆర్ట్స్‌లో ‘మిత్రమండలి’ చేస్తున్నాను. మరికొన్ని కథలు వింటున్నాను. బలమైన పాత్రలతో సినిమాలు చేయాలని ఆశిస్తున్నా.