Sangeeth Shoban: ప్రముఖ పంపిణీ దారుడు, “గూఢచారి, రావణాసుర” సినిమాలను నిర్మించిన అభిషేక్ నామా ఇప్పుడు ఓ వెబ్ ఫిల్మ్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, జీ5 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్నాడు. ‘ప్రేమ విమానం’ పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ ఫిల్మ్ ఫస్ట్ లుక్‌ను నిర్మాత అభిషేక్ నామా బర్త్ డే సందర్భంగా బుధవారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అన్ని ప్రధాన పాత్రధారులను పరిచయం చేశారు. ఇద్దరు పిల్లలు (దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా), హీరో హీరోయిన్లు (సంగీత్ శోభన్, శాన్వీ మేఘన), వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్…. ఇలా అందరూ ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు.
ఎలాగైనా సరే విమానం ఎక్కాలని ప్రయత్నించే ఇద్దరు పిల్లలు, అర్జెంట్‌గా ఫ్లైట్ ఎక్కి తమ కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ఓ ప్రేమ జంట… ఇలా అందరినీ ఒకే చోటకు చేర్చుతుందీ కథ. వీరి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయని దర్శకుడు సంతోష్ కాటా చెబుతున్నారు. బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ‘ప్రేమ విమానం’ కచ్చితంగా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందని నిర్మాత అభిషేక్ నామా తెలిపారు. ఈ వెబ్ ఫిల్మ్‌కి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను జగదీష్ చీకటి నిర్వర్తించారు.