Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి సోషల్ మీడియాలో తరచూ ఎన్నో వార్తలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా విదేశాల్లో కోట్ల రూపాయల విలువైన ఇళ్లు, లగ్జరీ లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన ప్రచారాలపై ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మొద్దని సూచించారు. ఇటీవల విదేశాల్లో ప్రభాస్ కోట్ల రూపాయల విలువైన ఇంటిని కొనుగోలు చేశారనే ప్రచారం గురించి ప్రస్తావిస్తూ.. “ఇలాంటి వార్తలు ఎవరో రాస్తారు. నిజమా కాదా అనేది చాలా మందికి తెలియదు. కానీ చాలామంది మాత్రం వెంటనే నమ్మేస్తారు. నేను కూడా ప్రభాస్‌తో కలిసి చార్టర్డ్ ఫ్లైట్‌లో ప్రయాణిస్తాను. అంత మాత్రాన ఆ ఫ్లైట్ నాదని చెప్పలేం కదా” అంటూ సరదాగా స్పందించారు.
ప్రభాస్ విదేశాలకు తరచూ వెళ్లడంపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. “అంత పెద్ద పాన్ ఇండియా స్టార్‌కు హైదరాబాద్‌లో పూర్తిగా స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉండదు. బయటకు వచ్చిన ప్రతిసారి అభిమానులు, భద్రత, మీడియా మధ్య ఉండాల్సి వస్తుంది. అందుకే రిలాక్స్ కావడానికి, ప్రశాంతంగా గడపడానికి విదేశాలను ఎంచుకుంటారు. అక్కడ సాధారణ వ్యక్తిలా స్వేచ్ఛగా తిరగగలుగుతారు” అని చెప్పారు. ప్రభాస్‌కు చాలా పరిమితమైన స్నేహితులు ఉంటారని, షూటింగ్‌లతో ఎప్పుడూ బిజీగా ఉండే ఆయనకు మానసిక ప్రశాంతత కూడా చాలా అవసరమని ప్రభాస్ శ్రీను తెలిపారు. విదేశీ ట్రిప్‌ల్లో ఆయన పూర్తిగా పనికి దూరంగా ఉంటూ, ఫోన్ కాల్స్ కూడా తగ్గించి, వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తారని వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాల కంటే నిజాలను మాత్రమే నమ్మాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

