Fauji vs King: ఈ ఏడాది డిసెంబర్ నెల ఇండియన్ సినీ పరిశ్రమకు అత్యంత కీలకమైన బాక్సాఫీస్ సీజన్‌గా మారింది. గత మూడు సంవత్సరాలుగా డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన భారీ చిత్రాలు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించడంతో, టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ నిర్మాతలు కూడా ఈ స్లాట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. 2023లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.920 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రణ్‌బీర్ కపూర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అదే సమయంలో విడుదలైన ‘సలార్’, ‘డంకీ’, ‘హాయ్ నాన్న’, ‘సామ్ బహదూర్’ చిత్రాలు కూడా మంచి వసూళ్లు సాధించినప్పటికీ, ‘సలార్ వర్సెస్ డంకీ’ పోటీ అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.
2024 డిసెంబర్‌లో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి పలు రికార్డులను బద్దలు కొట్టింది. అదే సీజన్‌లో రిలీజ్ అయిన ఇతర చిత్రాలపై కూడా ఈ సినిమా భారీ ప్రభావం చూపించింది. 2025 చివర్లో విడుదలైన ‘ధురంధర్’ కూడా దేశవ్యాప్తంగా అద్భుత స్పందనను అందుకుంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమా సక్సెస్‌తో పాటు అదే సమయంలో విడుదలైన పలు చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. ఇక అందరి దృష్టి ఇప్పుడు డిసెంబర్ 2026 పై పడింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం డిసెంబర్ 3న విడుదల కానుండగా, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ చిత్రం డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు చిత్రాల విడుదల తేదీల మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ, రెండూ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు కావడంతో బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల వేటలో ఎవరు పైచేయి సాధిస్తారన్న చర్చ ఇప్పటికే మొదలైంది. డిసెంబర్ నెలలో భారీ చిత్రాలు వరుస విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా? లేక మరో సినిమా సర్‌ప్రైజ్ చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సినీ అభిమానుల దృష్టి మొత్తం ‘ఫౌజీ’ vs ‘కింగ్’ చిత్రాలపైనే ఉంది.

