Swathi Weekly: తెలుగు పత్రికా ప్రపంచంలో స్వాతి వార, మాస పత్రికలు ఓ సంచలనం. తెలుగు పాఠకులు అందరూ ప్రతి గురువారం ‘స్వాతి’ వీక్లీ కోసం ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదు. నాలుగు దశాబ్దాలుగా విజయవంతంగా నడుస్తున్న ఏకైక వారపత్రిక స్వాతి. ఆ పత్రికను విజయపథంలో నడుపుతున్న సంపాదకులు, ప్రచురణ కర్త వేమూరి బలరామ్ విజయగాథ ఇప్పుడు వెండితెరకెక్కబోతోంది. ఆ సినిమా టైటిల్ ‘స్వాతి బలరాం – అతడే ఒక సైన్యం’. ఈ సినిమా రూపకల్పనకు ప్రముఖ రచయిత, దర్శకుడు ప్రభాకర్ జైనీ శ్రీకారం చుట్టారు. ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో ‘క్యాంపస్ అంపశయ్య’, ‘ప్రణయ వీధుల్లో’, కాళోజీ నారాయణరావు బయోపిక్ ‘ప్రజాకవి కాళోజీ’ వచ్చాయి. జైనీ క్రియేషన్స్ పతాకంపై స్వాతి బలరామ్ బయోపిక్ ను విజయలక్ష్మీ జైనీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో నటీనటులను ఎంపిక చేసి సెట్స్ మీదకు సినిమాను తీసుకు వెళ్లనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.
ఈ మూవీ గురించి ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ “పైపైన అందరూ విమర్శించినా… నూనూగు మీసమొచ్చిన ప్రతీ కుర్రవాడూ, పరికిణీ కట్టే వయసొచ్చిన ప్రతి ఆడపిల్లా, గత నలభై సంవత్సరాలుగా దిండు కింద దాచుకుని చదివిన ఏకైక వారపత్రిక స్వాతి. నవరసాల సాహిత్యంతో ప్రతీ ఒక్కరినీ అలరింప చేసిన సాహితీ సమరాంగణా సార్వభౌముడు బలరామ్ గారు. ఆయన్ని కలిసిన ఒక సందర్భంలో మాటల్లో ‘నా సాహిత్య ప్రస్థానం’ అన్న పరిచయ బుక్ లెట్ ఇచ్చాను. ఆయన అది చదువుతూ, నేను సినిమాలు తీస్తానని తెలుసుకుని సంతోషించారు. నేను చొరవగా, ‘కాళోజీ’ బయోపిక్ తీస్తున్నానని, అందులో వందేమాతరం శ్రీనివాస్ గారు పాడిన ఒక వీడియో పాటను, ల్యాప్ టాప్ లో చూపించాను. ఆయన గొప్పగా ఉందని ప్రశంసించారు. అదే సమయంలో చొరవ తీసుకుని ఆయన బయోపిక్ తీయాలనే నా కోరికను వెల్లడించాను. ఎందుకంటే ఆయన జీవితంలో ఎన్నో విజయాలు సాధించినా… వాటి కన్నా ఎక్కువ విషాదాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రజలకు తెలియవలసిన అవసరం ఉందనిపించింది. ఇప్పటికే ‘క్యాంపస్ – అంపశయ్య’, ‘ప్రజాకవి కాళోజీ’ వంటి జీవిత చరిత్రలను తీసిన అనుభవంతో, ఈ సినిమా కూడా తీయగలనన్న నమ్మకంతోనే ఈ ప్రతిపాదన పెట్టాను” అని తెలిపారు. స్వాతి బలరామ్ కూడా ఐదు నిముషాలు ఆలోచించి, తన ఆంతరంగీకులతో సంప్రదించి సరేనన్నారని ప్రభాకర్ జైనీ చెప్పారు. స్వాతి బలరామ్ వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని ప్రతిఫలించే విధంగా ఒక పాటను రికార్డ్ చేసి వారికి వినిపించానని, అటు తర్వాత రెండు మూడు రోజులు విజయవాడలోని వారింట్లో, ఆఫీసులో, కొడాలిలో, ఘంటసాలలో షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తి చేశామని ప్రభాకర్ జైనీ వివరించారు. ఇప్పుడు మిగిలిన షూటింగ్ కోసం వేమూరి బలరాం యవ్వనంలో ఉన్నప్పుడు, మధ్య వయసులో ఉన్నప్పుడున్న పోలికలు కలిగిన నటుల కోసం వెతుకుతున్నామని చెప్పారు. ఔత్సాహిక నటులు తమ ప్రొఫైల్స్, ఆడిషన్ వీడియోలను పంపమని కోరారు.