భారత చిత్రసీమలో ఉన్న మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీస్‌లో పూజా హెగ్డే ఒకరు. ఏ ముహూర్తాన ‘డీజే’ చిత్రానికి సంతకం చేసిందో ఏమో గానీ, అప్పట్నుంచి ఈమె దశ పూర్తిగా తిరిగిపోయింది. వరుజగా క్రేజీ ఆఫర్లు రావడం మొదలయ్యాయి. చూస్తుండగానే ఈ భామ పాన్ ఇండియా కథానాయికగా ఎదిగిపోయింది. అందుకే, క్రేజీ ప్రాజెక్టులకు ముందుగా ఈమెనే కన్సిడర్ చేస్తున్నారు. రీసెంట్‌గా హ్యాట్రిక్ ఫ్లాపులు చవిచూసినా సరే, క్రేజ్ మాత్రం తగ్గకపోవడంతో ఈమెకి ఇప్పటికీ భారీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.
లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో రూపొందనున్న ‘జగ గణ మన’ సినిమాలో పూజా హెగ్డేని హీరోయిన్‌గా ఎంపిక చేశారట! తొలుత బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా తీసుకోవాలని మేకర్స్ భావించారు. పాన్ ఇండియా సినిమా కదా.. బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న జాన్వీని తీసుకుంటే, మార్కెట్ పరంగా కలిసొస్తుందని అనుకున్నారు. ఏమైందో ఏమో తెలీదు కానీ, చివరికి పూజా హెగ్డేని తీసుకున్నారు. తన వద్దకు ఈ సినిమా ఆఫర్ రాగానే, పూజా వెంటనే పచ్చజెండా ఊపిందని ఇన్‌సైడ్ న్యూస్!
కాగా.. పూరీ, విజయ్ కాంబోలో రానున్న రెండో సినిమా ఇది. ఆల్రెడీ వీరి కలయికలో ‘లైగర్’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది. సాధారణంగా, ఓ దర్శకుడితో కలిసి పని చేసిన హీరో, ఆ సినిమా రిజల్ట్‌ని బట్టి మళ్ళీ ఆ డైరెక్టర్‌తో జట్టు కట్టాలా? వద్దా? అనేది నిర్ణయిస్తాడు. కానీ, ఇక్కడ పూరీ మీదున్న పూర్తి నమ్మకంతో, ‘లైగర్’ రిలీజ్ కాకముందే మరో సినిమా చేయడానికి విజయ్ రెడీ అయిపోయాడు.