‘సర్కారు వారి పాట’తో సూపర్ సక్సెస్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మహేష్ ఈ మూవీ స్క్రిప్టుని లాక్ చేశారని.. దాంతో ఆగష్టు మొదటి వారంలో రెగ్యులర్ షూట్‌ని ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక SSMB28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్నఈ సినిమాలో.. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమానికి కూడా హాజరైన పూజా హెగ్డేను.. ఆ మధ్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్టు ప్రచారం జరిగింది. వరుసగా ‘రాధేశ్యామ్’, ‘బీస్ట్’, ‘ఆచార్య’ సినిమాలు ఫ్లాప్ అవడంతో.. పూజాను పక్కకు పెట్టేశారని వినిపించింది. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది.
గతంలో త్రివిక్రమ్ తెరకెక్కించిన అరవింద సమేత, అల వైకుంఠపురములో.. సినిమాల్లో పూజనే హీరోయిన్‌గా నటించింది. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ కావడంతో.. మహేశ్ సినిమాలో కూడా ఆమెనే తీసుకున్నాడు మాటల మాంత్రికుడు. పైగా పూజాకు హ్యాట్రిక్ ఫ్లాప్స్ పడ్డా కూడా భారీ ఆఫర్స్ అందుకుంటోంది. కాబట్టి మహేష్ సరసన హీరోయిన్‌గా పూజా ఫిక్స్ అయిపోయింది. అయితే ప్రస్తుతం పూరి జనగణమనతో పాటు పలు బాలీవుడ్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది పూజా.. దాంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతోందట. ఈ నేపథ్యంలో మహేష్ సినిమాకు కొన్ని కండీషన్స్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం 45 రోజులు కాల్షిట్స్‌ను మాత్రమే కేటాయించదట అమ్మడు. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా.. ఇచ్చిన డేట్స్‌లోనే తనకు సంబంధించిన షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని మేకర్స్‌ను కోరిందట. అయితే మహేష్ కూడా నెక్ట్స్ రాజమౌళి ప్రాజెక్ట్ కోసం.. త్రివిక్రమ్ సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనుకుంటున్నాడట. దాంతో ఈ కొత్త సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ అవడం పక్కా అంటున్నారు. మరి అనుకున్నంత స్పీడ్‌గా మహేష్-త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ అవుతుందేమో చూడాలి.