సక్సెస్ ఫుల్ కాంబోకు ఎప్పుడూ సూపర్ క్రేజ్ ఉంటుంది. మార్కెట్ వర్గాలలోనూ ఆ ప్రాజెక్ట్స్ పై ఆసక్తి నెలకొంటుంది. ప్రస్తుతం అలా ఆసక్తిని కలిగించే చిత్రం ఒకటి సెట్స్ పై ఉంది. దీనిని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మరో నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘దాసరి ప్రొడక్షన్స్’ తో కలసి నిర్మిస్తోంది. వివరాల్లోకి వెళితే… ఆమధ్య యువ కథానాయకుడు నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా రూపొందిన ‘కళ్యాణ వైభోగమ’ మంచి విజయం సాధించింది. అలాగే నాగశౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందిన ‘ఊహలు గుసగుస లాడే’, ‘జో అచ్యుతానంద’ చిత్రాల విజయాలు తెలిసిందే.
ఇప్పుడు వీరి కాంబినేషన్లో అంటే.. కథానాయకుడిగా నాగశౌర్య, ఆయనకు జోడీగా మాళవిక నాయర్, దర్శకునిగా అవసరాల శ్రీనివాస్ లను టీమ్ గా చేసుకుని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం లండన్ లో జరుగుతోంది. ఈ భారీ షెడ్యూల్ లో చిత్రంలోని ప్రధాన తారాగణం అంతా పాల్గొంటోంది. ‘ఇలాంటి విజయవంతమైన చిత్రాల నాయక, నాయికలు, దర్శకుడు, ప్రతిభ గల సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంద’ని తెలిపారు ఈ చిత్ర నిర్మాతలు టి. జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల తెలిపారు.