ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప” చిత్రం డిసెంబర్ 17న విడుదలై మంచి టాక్ తో దూసుకెళ్తోంది. నిర్మాతలు సినిమా విజయాన్ని అభిమానులతో జరుపుకోవాలని భావించారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పలు సక్సెస్ పార్టీలను ప్లాన్ చేయాలనుకున్నారు. ఈరోజు కాకినాడలో టీమ్ సక్సెస్ పార్టీని ప్రకటించింది. కానీ అధికారులు ఈవెంట్‌కు అనుమతి నిరాకరించారని తెలుస్తోంది. ఈ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈవెంట్ క్యాన్సిల్ అయినట్లు వారి అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ తెలియజేసింది. “ఈరోజు కాకినాడలో జరగాల్సిన ‘పుష్ప’ మాసీవ్ సక్సెస్ పార్టీ పర్మిషన్ సమస్యల కారణంగా రద్దు అయ్యింది!” అంటూ మైత్రి ట్వీట్ చేసింది. పార్టీకి అధికారులు అనుమతి నిరాకరిస్తున్నట్లు నిర్మాతలు పేర్కొన్నప్పటికీ, అసలు ఏ కారణంతో అనుమతి నిరాకరించారనే దానిపై స్పష్టత లేదు.
పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని కొంతమంది అంటున్నారు. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ ప్రకటించాయి. థియేటర్లు, మాల్స్, రెస్టారెంట్లు, ఇతర ప్రదేశాలలో ఆక్యుపెన్సీపై పరిమితులను అమలు చేశాయి. కాబట్టి ఈ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించి ఉండవచ్చు. టాలీవుడ్ పట్ల ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు మరో కారణం కావచ్చు. ఇప్పటికే ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించి, బెనిఫిట్ షోలను రద్దు చేసింది, నిబంధనలు పాటించని చాలా థియేటర్లను సీజ్ చేసింది. ఇక కొన్ని రోజుల క్రితం డిసెంబర్ 21న తిరుపతిలో చిత్ర విజయోత్సవాన్ని జరుపుకుంది ‘పుష్ప’ టీమ్. మరి టీమ్ ఈ ఈవెంట్‌ని మరేదైనా వేదికపైకి మారుస్తుందా ? లేదా ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంచుతుందా ? అనేది చూడాలి. మొత్తానికి టికెట్ల సమస్య మాత్రమే కాకుండా పర్మిషన్ కష్టాలను కూడా ఎదుర్కొంటోంది ‘పుష్ప’.
#PushpaTheRise MASSive Success Party in Kakinada today has been cancelled due to permission issues!
— Mythri Movie Makers (@MythriOfficial) December 24, 2021