PawanKalyan On Unstoppable:నందమూరి బాలకృష్ణ ‘ఆహా’లో నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్’సీజన్ 2లోని 9వ ఎపిసోడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనడమే పెద్ద విశేషంగా మారింది. ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూడసాగారు. అందుకు తగ్గట్టుగానే గతంలో ఏ ఎపిసోడ్ కు లేనంత క్రేజ్ ను తీసుకు వస్తూ బాలయ్య, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు బజ్ తీసుకు వచ్చారు. పైగా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇద్దరూ సినిమాలతోనే కాదు రాజకీయాల్లోనూ సంబంధం ఉన్న కారణంగా వారిద్దరి ఫ్యాన్స్ మాత్రమే కాదు, పొలిటికల్ ఎరినాలో ఉన్నవాళ్లు కూడా ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారందరికీ వినోదం పంచుతూ గురువారం (ఫిబ్రవరి 2న ) రాత్రి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ మొదలయింది.
బాలయ్య, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా రూపొందించాలని ముందుగానే ప్లాన్ చేసుకున్న కారణంగా ఈ ఎపిసోడ్ లో గతంలో టీజర్ లో చూపించిన సీన్స్ నే పదే పదే చూపించారు. అదలా ఉంచితే ‘పొగిడించుకోవడమే కానీ… పొగడడం చేతకాదు…’ అన్న చందాన సాగుతున్న బాలకృష్ణ ఈ టాక్ షో నిర్వహిస్తున్నప్పటి నుంచీ ఆ నియమానికి వీడ్కోలు పలికారు. తన షో కోసం వచ్చిన యంగ్ హీరోస్ ను సైతం బాలయ్య ఎంతగానో గౌరవిస్తూ, వారిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ లాంటి మాస్ హీరో వస్తే బాలయ్య నోట పదాలు పరుగు తీయవలసిందేగా! బాలయ్య, పవన్ ఒకేసారి స్టేజ్ మీదకు వచ్చారు. తరువాత పవన్ ను షో కు ఆహ్వానిస్తూ “ఈ రోజు నాతో పాటు వచ్చిన వ్యక్తి- ఓ శక్తి- శక్తిని మించిన వ్యక్తిత్వం- నటుడు- నాయకుడు- ప్రజాసేవకుడు- ప్రశ్నల యంత్రం- విప్లవమంత్రం- నిజాయితీకి నిలువెత్తు అద్దం- నిబద్ధతకు నిలువెత్తు రూపం…” అంటూ బాలయ్య పవన్ ను పొగడడం నిజంగా కొణిదెల ఫ్యాన్స్ కు మహదానందం కలిగించక మానదు. ‘సామాజిక అంశాలలో సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు’ అన్న అర్థంలోనూ పొగిడేయడం మరీ అతిశయోక్తిలా అనిపిస్తుంది. కానీ, ఆ పొగడ్తలు పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్కునివ్వక మానవు. “ఈశ్వరా…పవనేశ్వరా… పవరేశ్వరా…” అంటూ బాలయ్య అనడమూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అలాగే బాలయ్య ఈ షో లో ఎప్పుడూ చెప్పే “నేను మీకు తెలుసు…నా స్థానం మీ మనసు…”అని పవన్ కళ్యాణ్ చెప్పడం అలరించక మానదు. ‘స్టార్ట్ కాకుండానే చెమటలు పట్టిస్తున్నారు…’ అని పవన్ చెప్పడమూ మురిపిస్తుంది.
“నాకంటే చిన్నవాడివి… కాబట్టి మీరు అనలేను… భయ్యా అంటాను…” అంటూ బాలయ్య చెప్పడం – “మీ ఇష్టం సార్…” అని పవన్ అనడం అన్నీ ఆకట్టుకునేవే! వారిద్దరూ తమ మొదటి కలయికను గుర్తు చేసుకున్నారు. “అమ్మా…నిన్నుచూస్తే నాకు కుల్లు…ఎందుకంటే మేం పాటల కోసం, ఫైట్స్ కోసం పాట్లు పడతాం… నువ్వేమో అంత కష్టపడకుండా నవ్వుతో పడేస్తావ్…” అంటూ బాలయ్య అనడం కూడా అభిమానులకు ఓ టానిక్ లా పనిచేయక మానదు. తెరపై పవన్ కు సంబంధించిన ఫోటోలు చూపించి వాటికి తగ్గట్టుగా ప్రశ్నలు కురిపించారు బాలయ్య. అవి కూడా పవన్ ఫ్యాన్స్ ను మురిపించే అంశాలే! తన నటజీవితంలో మోస్ట్ ఎంబరాసింగ్ సీన్ గురించి పవన్ చెప్పిన విషయాలు కూడా భలేగా వినోదం పంచాయి. తాను పాలిటిక్స్ లోకి ఎందుకు వచ్చానన్న విషయాన్నీ పవన్ వివరించిన తీరు ఆకట్టుకుంటుంది. ‘ఈ పెళ్ళిళ్ళ గొడవేంటి భయ్యా?’ అన్న ప్రశ్నకు పవన్ ఏ మాత్రం దాచుకోకుండా అన్నీ వివరించిన విధానం కూడా అలరిస్తుంది. అంతా విన్న తరువాత బాలయ్య, “ఇకపై పవన్ గురించి, ఆయన పెళ్లిళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే మీరు ఊరకుక్కలతో సమానం…” అంటూ అనడమూ చూసే పొలిటీషియన్స్ లో హీట్ పుట్టించక మానదు.
సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ సమయంలో మీరు బాగా తల్లడిల్లిపోయారని, అతను కోలుకోవడానికి ఎంతో చేశావని విన్నాను అంటూ బాలయ్య అడగడం, దానికి పవన్ సమాధానం చెప్పడం జరిగింది. అయితే ఇదే సమయంలో ఈ మధ్యనే అనారోగ్యం పాలయిన తన అన్న కొడుకు తారకరత్న విషయంలో బాలయ్య పడ్డ తపననూ ఈ సందర్భంగా అభిమానులు గుర్తు చేసుకోకమానరు. మధ్యలో సాయిధరమ్ ఈ షో లో ఎంటర్ కావడం ఆకట్టుకుంటుంది. ఆ సమయంలో ‘హారర్ సినిమాకు… అమ్మాయిలకు తేడా లేదంటూ’ సాయిధరమ్ చెప్పడం భలే వినోదం పంచింది. సాయిధరమ్ ను తొడకొట్టమంటే అందుకు అతను చేసిన చేష్టలు కూడా వినోదం పంచుతాయి. మొత్తం మీద బాలయ్య, పవన్ ఎపిసోడ్ అంటే పొలిటీషియన్స్ కూడా కాబట్టి ఏదో సీరియస్ నెస్ చోటు చేసుకుంటుందేమో అనుకున్నవారికి ఈ ఎపిసోడ్ ఎంతగానో ఎంటర్ టైన్ చేయడం విశేషం! ఇదే సందర్భంలో తన మేనమామ తనకు ఎలాంటి విషయాలు చెప్పారో సాయిధరమ్ వివరించడం కూడా ఆకట్టుకుంటుంది.
‘ఆహా’ సంస్థ నిర్మల్ జిల్లాలోని చాకిరేవు అనే చిన్నగ్రామాన్ని దత్తత తీసుకుంది. అక్కడ 70మంది జనాభా ఉన్న గోండుజాతి వారు జీవిస్తున్నారు. వారికి సంబంధించిన ఏవీ ప్రదర్శించాక, ఆ ఊరి ప్రముఖులను ఆ వేదికపైకి తీసుకు వచ్చారు. వారు తాము ఆదివాసులం కాబట్టి, అడవిలోనే ఉండాలని ఉంటుందని చెప్పారు. అత్యంత తక్కువ వనరులతో జీవించే ఆదివాసీల జీవితాలు బాగుపడాలని ఈ సందర్భంగా పవన్ కోరుకున్నారు. తరువాత కూడా టాక్ షో కంటిన్యూఅయింది. ఈ సందర్భంగా పవన్ కెరీర్ గురించిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలు సైతం అలరిస్తాయి. చివరలో కొన్ని ప్రశ్నలు మాత్రమే వినిపిస్తాయి. వాటికి పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానాలు వచ్చే ఎపిసోడ్ లో చూడవలసిందే!
ఈ ఎపిసోడ్ చూసిన తరువాతనైనా “మా హీరో గొప్ప…మా హీరో గొప్ప…” అంటూ వాదులాడుకొనే అభిమానుల్లో మార్పు వస్తుందేమో చూడాలి. ఎందుకంటే ఇటీవల తెలుగునేలపై సంక్రాంతి కానుకలుగా వచ్చిన టాప్ స్టార్స్ సినిమాల విషయంలో అనుచితమైన పోట్లాటలు చోటు చేసుకున్నాయి. అలా పోట్లాడిన వారందరూ ఈ అన్ స్టాపబుల్ లో బాలయ్య- పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ చూసయినా మారితే బాగుంటుందని అనిపిస్తోంది.