పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడింది. ఆంధ్రప్రదేవశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం వల్ల ‘భీమ్లా నాయక్’ ఈవెంట్ ను వాయిదా వేశారు. పవన్ కళ్యాణ్, రానా ముఖ్యపాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ఆధారంగా తెరకెక్కింది. తెలుగు నేటివిటికి అనుగుణంగా చిన్న చిన్న మార్పులతో తెరకెక్కిన ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రంలో నిత్యామీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్స్ గా నటించారు. థమన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.
Read Also : Bheemla Nayak : ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు
‘భీమ్లా నాయక్’ వేడుకను భారీ ఎత్తున హైదరాబాద్ లోని యూసప్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్లాన్ చేశారు. తెలంగాణ మంత్రి కె.తారకరామారావు ముఖ్య అతిథిగా పాల్గొనవలసింది. అయితే ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో వాయిదా పడింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ‘విషాద సమయంలో సినిమా వేడుక చేయడానికి మనస్కరించట్లేదు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో కీలక బాధ్యతల్లో ఉన్న శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణం వల్ల నెలకొన్న ఈ విషాద సమయంలో భీమ్లా నాయక్ వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. అందుకే నేడు జరగవలసిన భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది. వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ తెలియచేస్తుంది’ అంటూ హీరో పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనను విడుదల చేశారు.