విజయం ఆనందాన్నిస్తే, అపజయం ఆలోచింప చేస్తుందని అంటారు. పలుమార్లు అభిమానులను తన విజయాలతో ఆనందింప చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన ఆలోచిస్తూ సాగుతున్నారనే చెప్పాలి. పాలిటిక్స్ లో రుచి చూసిన పరాజయం బహుశా ఆయనను అలా అడుగులు వేయిస్తోందని భావించవచ్చు. రాజకీయాల్లో చేదు అనుభవం ఎదురు కాగానే ఇక సినిమాలకు స్వస్తి పలికి, పాలిటిక్స్ పైనే దృష్టి సారించాలని ఆయన ఆశించారు. కానీ, అభిమానులు మాత్రం పవన్ ను తెరపై మళ్ళీ చూడాలని అభిలషించారు. వారి మాటకు విలువనిస్తూ పవన్ మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి అలరిస్తున్నారు.
మొన్న ‘వకీల్ సాబ్’గానూ, నిన్న ‘భీమ్లా నాయక్’గానూ మురిపించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’గా నటిస్తున్నారు. తనకు ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా ఆరంభించారు పవన్. ‘జనసేనాని’గా తన చిత్రాలలో తమ పార్టీ ప్రణాళికలోని అంశాలను చొప్పిస్తూ ఉన్నారు పవన్. దాంతో ఇతర పార్టీలవారు సైతం పవన్ సినిమాలను చూసి, అందులో ఏవైనా లొసుగులున్నాయేమో పట్టేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ తొలుత అన్నచాటుతమ్ముడుగానే చిత్రసీమలో అడుగు పెట్టారు. తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’లోనే తనకు మార్షల్ ఆర్ట్స్ లో పట్టు ఉందని నిరూపించుకున్నారు. తరువాత పవన్ నటించిన “గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి” చిత్రాలు వరుస విజయాలు చూశాయి. వరుసగా ఏడు చిత్రాలు ఒకదానిని మించి మరోటి విజయం సాధించాయి. దాంతో పవన్ కళ్యాణ్ ‘పవర్ స్టార్’గా జనం మదిలో నిలచిపోయారు. పవన్ తన పవర్ మరింత చూపించడానికి అన్నట్టు కొన్ని సినిమాల్లో ఫైట్స్ కంపోజ్ చేశారు. తన అన్న చిరంజీవి నటించిన ‘డాడీ’లో ఆయనకే ఫైట్ మాస్టర్ గా పనిచేశారంటే పవన్ ఎంత దూకుడు చూపించారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎనిమిదవ చిత్రం ‘జానీ’తో దర్శకునిగా మెగాఫోన్ కూడా పట్టేశారు. అది అలరించలేక పోయింది. దాంతో మళ్ళీ దర్శకత్వం వైపు చూడలేదు పవన్. కానీ, తన ప్రతి చిత్రంలో వైవిధ్యం చూపించాలనే తపన మాత్రం ఆయనలో తగ్గలేదు.
‘ఖుషి’ తరువాత పవన్ నటించిన ఆరు చిత్రాలు అంతగా అలరించలేకపోయాయి. ఆ సమయంలో పవన్ తో త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘జల్సా’ బ్లాక్ బస్టర్ గా నిలచింది. తరువాత మళ్ళీ మామూలే అన్నట్టు మూడు ఫ్లాపులు పలకరించాయి. అప్పుడు హరీశ్ శంకర్ తన ‘గబ్బర్ సింగ్’తో గ్రాండ్ సక్సెస్ ను అందించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటించిన రెండో సినిమా ‘అత్తారింటికి దారేది’ అదరహో అన్న స్థాయిలో అలరించింది. ఆ సినిమా తరువాత మళ్ళీ పవన్ ను ఆ స్థాయి విజయం పలకరించలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటించిన మూడో సినిమా ‘అజ్ఞాతవాసి’ అపజయాన్ని చవిచూపింది. మరోవైపు రాజకీయాల్లోనూ పరాజయమే పలకరించింది. దాంతో మూడేళ్ళు పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నారు. తాను ‘ప్రశ్నించే గళాన్ని’ అంటూ చాటుకొని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
పవన్ కు ఆరంభంలో రీమేక్ మూవీస్ అచ్చివచ్చాయనే చెప్పాలి. “గోకులంలో సీత, సుస్వాగతం, ఖుషి, గబ్బర్ సింగ్” వంటి సూపర్ హిట్స్ రీమేక్స్ ద్వారానే పవన్ ఖాతాలో చేరాయి. అలాగే కొన్ని రీమేక్స్ ఆయనకు చేదునూ రుచి చూపించాయి. అయినా, పవన్ రీమేక్స్ పైనే దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. ‘పింక్’ రీమేక్ గా రూపొందిన ‘వకీల్ సాబ్’తో మళ్ళీ జనాన్ని పలకరించారు. మళయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ గా ఇప్పుడు ‘భీమ్లా నాయక్’లో నటించారు. నటదర్శకుడు సముద్రఖని తమిళంలో తెరకెక్కించిన ‘వినోదయ సితమ్’ చిత్రాన్నీ తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నంలో ఉన్నారు పవన్. ఆయన పుట్టినరోజయిన సెప్టెంబర్ 2న ఈ సారి పవన్ అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ‘జల్సా’ చిత్రాన్ని విడుదల చేసి, వీక్షించి ఆనందించనున్నారు. ప్రస్తుతం అనేకమంది స్టార్ హీరోస్ ఫ్యాన్స్ ఇదే పంథాలో తమ అభిమాన హీరోల పుట్టినరోజున పాత చిత్రాలతో పరవశించిపోతున్నారు. మరి పవన్ ఫ్యాన్స్ ఏ తీరున ఎంజాయ్ చేస్తారో, వారిని తన రాబోయే ‘హరిహర వీరమల్లు’తో పవన్ ఏ రీతిన అలరిస్తారో చూడాలి.