పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. అయితే వారిద్దరి మధ్య సినిమాల గురించే కాకుండా పలు సామాజిక అంశాలు కూడా చర్చకు వస్తాయి. తాజాగా ఈ స్నేహితులిద్దరూ కలిసి తెలంగాణ విమోచన దినోత్సవం రోజున లెజెండరీ కవి రచయిత శ్రీశ్రీ గురించి చర్చించారు. ఆయన ఒక ఎత్తైన పర్వతం లాంటి వారని, ఆయన ముందు మనమంతా గులకరాళ్ళమని అన్నారు. శ్రీశ్రీ చేతిరాతతో ఉన్న ‘మహా ప్రస్థానం’ ప్రత్యేక స్మరణికను పవన్, త్రివిక్రమ్ కు జ్ఞాపికగా అందచేశారు. ఆ పుస్తక ముద్రణ, అందులోని అరుదైన చిత్రాల గురించి వీరు చర్చించుకున్నారు.
Read Also : “దృశ్యం 2” ఫస్ట్ లుక్ కు టైమ్ ఫిక్స్
త్రివిక్రమ్ మాట్లాడుతూ “కవి తాలూకు ప్రయాణం అంటే ఒక జాతి తాలూకు ప్రయాణం. ఆయన వేసిన ఒక అడుగు.. రాసిన ఒక పుస్తకం.. ఒక శతాబ్దం మొత్తం మాట్లాడుకుంటుంది.. చాలా శతాబ్దాలపాటు మాట్లాడుకొంటూనే ఉంటుంది. ఆయన తాలూకు జ్ఞాపకం మన జాతి పాడుకునే గీతం. శ్రీశ్రీ తెలుగువాళ్లు గర్వించదగ్గ కవి.. ఈ శతాబ్దం నాది అని గర్వంగా చాటినవాడు.. కవికుండాల్సిన ధిషణాహంకారం ఉన్నవాడు.. తెలంగాణ విమోచన దినోత్సవం రోజు ఆయన పుస్తకం చూడడం నిజంగా గొప్ప విషయం. ఆయన ఆత్మ ఎక్కడున్నా స్వతంత్రం అనే సరికి అక్కడికి వచ్చి ఆగుతుంది” అన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘ఒక కవి గురించి మరో కవి చెబితే వచ్చే సొబగు ఇది’ అన్నారు. వెంటనే త్రివిక్రమ్ స్పందించి ‘శ్రీశ్రీ అంటే ఒక సమున్నత శిఖరం. మనందరం ఆ శిఖరం దగ్గరి గులక రాళ్లు’ అన్నారు.