లోకనాయకుడు కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే! విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆమధ్య వచ్చిన ఒక టీజర్.. చాలా ఆసక్తికరంగానూ, వినూత్నంగానూ ఉండడంతో అందరినీ ఆకట్టుకుంది. ఇక కమల్ హాసన్‌ని పూర్తి మాస్ అవతారంలో చూసి చాలాకాలమే అవుతోంది కాబట్టి, ఈ సినిమా ఆ ఆకలి తీరుతుందని ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు.
ఇకపోతే, ఈ సినిమా నుంచి లేటెస్ట్‌గా ఓ లిరికల్ పాట విడుదలైంది. పతల పతల అంటూ సాగే ఈ పాటకు యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చాడు. ఇతడ్ని మాస్ పాటలకు కేరాఫ్ అడ్రస్‌గా ఎందుకు పేర్కొంటారో, ఈ పాట విన్నాక మీకే అర్థమవుతుంది. ఇక కమల్ హాసన్ అయితే మాస్ గెటప్‌లో వారెవ్వా అనిపించేలా ఉన్నారు. మధ్యలో ఒక చోట ఈయన బాలయ్య స్టెప్‌ని కాపీ కొట్టడాన్ని కూడా మనం గమనించవచ్చు. ‘యా యా జై బాలయ్య’ పాటలో షర్టులు మారుస్తూ బాలయ్య చేసిన స్టెప్పు తరహాలోనే, ఇందులో కమల్ స్టెప్పులేశారు. కాకపోతే, ఇక్కడ ఈయన షర్ట్స్ మార్చడు అంతే! ఇక ఈ పాట అయితే ఒక సెపరేట్ యూఫోరియా క్రియేట్ చేయడం ఖాయం. ఈ పాట వింటున్నప్పుడు, మీరు కూడా స్టెప్పులు వేయకుండా ఉండలేరు.