ఈ మధ్య ప్రముఖ దర్శకుడు జయంత్ సి.ఫరాన్జీ ఓ సారి ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు దగ్గరకు వెళ్ళి ఆయనతో ఫోటీ తీసుకున్నారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అనేక చిత్రాల్లో ఎంతో చెలాకీగా కనిపించిన పరుచూరి వెంకటేశ్వరరావు, అంత ముసలివారా అని అందరూ అవాక్కయ్యారు. ఎంతోమంది దర్శకుల తొలి చిత్రాలకు పరుచూరి సోదరులు రచన చేసి అలరించారు. అలాగే జయంత్ మొదటి సినిమా’ ప్రేమించుకుందాం…రా’ కు కూడా వాళ్ళే రచయితలు. అందువల్ల గురుభక్తితో జయంత్ ఈ మధ్య పరుచూరి అగ్రజుని కలసినప్పుడు ఫోటో తీసుకొని షేర్ చేశారు. వెంకటేశ్వరరావు వయసు మీద పడినా, ఇప్పటికీ రచన చేయడానికి ఉత్సాహంగానే ఉన్నారాయన.
పరుచూరి వెంకటేశ్వరరావు 1943 జూన్ 21న జన్మించారు. చదువుకొనే రోజుల నుంచీ నాటకాలు రాయడం, వాటిని ప్రదర్శించడం చేసేవారు. హైదరాబాద్ ఏజీ ఆఫీసులో పనిచేసే రోజుల్లోనూ అదే వరస. పక్కనే ఉన్న రవీంద్ర భారతిలో ఆయన రాసిన పలు నాటకాలు ప్రదర్శితమయ్యాయి. తరువాత చిత్రసీమలో అడుగు పెట్టారు వెంకటేశ్వరరావు. ఆరంభంలో దేవదాస్ కనకాల, వేజెళ్ళ సత్యనారాయణ వంటి దర్శకుల చిత్రాలకు పసందైన పదాలు పలికించి, ఆకట్టుకున్నారు. ఈ అన్నకు తగ్గ తమ్ముడుగా పరుచూరి గోపాలకృష్ణ సైతం తన వేసవి సెలవుల్లో అన్నకు సాయంగా పలుకులు పలికించే వారు. అలా మొదలైన ఈ సోదరుల ప్రయాణం, యన్టీఆర్ వారికి ‘పరుచూరి బ్రదర్స్’ అని నామకరణం చేసి తమ ‘అనురాగదేవత’ ద్వారా వెలుగులోకి తీసుకు వచ్చారు. అక్కడ నుంచీ మరి వెనుదిరిగి చూసుకోలేదు ఈ సోదరులు.
తెలుగు చిత్రసీమలో ఈ రోజున తొడలు చరిచి, మీసాలు మెలేసి, వీరావేశాలు ప్రదర్శించే సన్నివేశాలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సీన్స్ కు ఓ క్రేజ్ తీసుకు వచ్చిన ఘనత నిస్సందేహంగా పరుచూరి సోదరులదే! ఇక పురాణగాథలను, సాంఘికాలకు అనువుగా మలచడంలోనూ సిద్ధహస్తులు ఈ సోదరులు. వీరిలో అగ్రజుడు పరుచూరి వెంకటేశ్వరరావు, అనుజుడు గోపాలకృష్ణ. ఇద్దరూ ఇద్దరే!
పరుచూరి సోదరుల కలం బలంతో ఎంతోమంది స్టార్ డమ్ చేజిక్కించుకున్నారు. తెలుగునాట ఫ్యాక్షనిజం కథలకు దారి చూపింది ఈ సోదరులే. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పలు కథలు రూపొందించారు. వాటితో తెరకెక్కిన చిత్రాలన్నీ అలరించాయి. ఇక ‘సమరసింహారెడ్డి’తో ఫ్యాక్షనిజమ్ కు హీరోయిజం తీసుకు వచ్చిన ఘనత కూడా వీరిదే. ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, ఆది’ వంటి సూపర్ డూపర్ మూవీస్ లో పరుచూరి బ్రదర్స్ రాసిన సంభాషణలు ఎంతగా ఆకట్టుకున్నాయో చెప్పవలసిన పనిలేదు. నాలుగు దశాబ్దాలుగా ఈ సోదరద్వయం కలిసే రచన సాగిస్తూ ఉండడం విశేషం. చిరంజీవి ‘సైరా…నరసింహారెడ్డి’ రచనలోనూ ఈ సోదరులు పాలు పంచుకున్నారు.
ఈ సోదరులు దర్శకులుగానూ ఓ తొమ్మిది చిత్రాలను రూపొందించారు. అన్నదమ్ములిద్దరూ నటనలోనూ అడుగు పెట్టారు. పరుచూరి వెంకటేశ్వర రావు అనేక చిత్రాలలో కేరెక్టర్ యాక్టర్ గానూ, కొన్నిట విలన్ గానూ నటించి మెప్పించారు. ఇప్పటికీ తమ దరికి వచ్చిన సినిమాలకు రచన చేయడానికీ, పాత్రల్లో నటించడానికి పరుచూరి వెంకటేశ్వరరావు సిద్ధంగానే ఉన్నారు.