Parampara-2 Web Series:
హీరో, విలన్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్… ఇలా పాత్ర ఏదైనా నటుడిగా మెప్పిస్తున్నాడు నవీన్ చంద్ర. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లోనూ నటించి, మంచి పేరు తెచ్చుకుంటున్నారు. నవీన్ చంద్ర నటించిన ‘పరంపర’ వెబ్ సీరిస్ ఇప్పటికే సీజన్ 1 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అయ్యింది. దానికి మంచి స్పందన రావడంతో అప్పట్లోనే దీనికి సీక్వెల్ చిత్రీకరణనూ ప్రారంభించారు. జగపతి బాబు, శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్ కు ఎల్. కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ వెబ్ సీరీస్ సెకండ్ సీజన్ ఈ నెల 21 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా నవీన్ చంద్ర మీడియాలో మాట్లాడారు.
”పరంపర వెబ్ సిరీస్ మొదటి భాగం చాలా పెద్ద హిట్ అయ్యింది. తొలి భాగంతో పాటు సెకండ్ సీజన్ కూ అప్పుడే సన్నాహాలు ప్రారంభించాం. అందుకే ఇంత త్వరగా సెకండ్ సీజన్ ను మీ ముందుకు తీసుకురాగలిగాం. ఇందులో నేను గోపి అనే పాత్రలో నటించాను. ఫస్ట్ సీజన్ లో శరత్ కుమార్ కు ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఈ సీజన్ లో నేను అతని మీద పైచేయి సాధిస్తాను. తన తండ్రి నుంచి లాక్కున్న అధికారం, పేరు ప్రతిష్టలను తిరిగి నాన్నకు ఇచ్చేందుకు ఓ కొడుకు చేసిన యుద్ధమే ఈ వెబ్ సిరీస్. తండ్రిని పరాజితుడిగా చూడలేకపోతాడు గోపి. నాన్న కోల్పోయినవన్నీ తిరిగి ఇప్పించేందుకు ఫైట్ చేస్తుంటాడు” అని చెప్పారు. ‘పరంపర’ వెబ్ సీరిస్ ట్రైలర్ ను రామ్ చరణ్ విడుదల చేశారు. స్టార్స్ ప్రమోషన్ లో పాలుపంచుకోవడంతో రీచ్ వేరే రకంగా ఉంటుందని, కొవిడ్ కారణంగా థియేటర్లకు దూరమైన ప్రేక్షకులు ఇప్పుడు వెబ్ సీరిస్ లకు బాగా అలవాటు పడ్డారని నవీన్ చంద్ర అన్నారు.
తన సినీ ప్రయాణం గురించి చెబుతూ, ”నటుడిగా పేరు తెచ్చే అవకాశాలు ఎక్కడున్నా వదలుకోను. నా మొదటి చిత్రం ‘అందాల రాక్షసి’తో గుర్తింపు దక్కింది. ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత వీర రాఘవ’లో నటించినప్పుడు మరోసారి ఫేమ్ అయ్యాను. ఎన్టీఆర్ ఆ సినిమా ఫంక్షన్ స్టేజీ మీదే నా పాత్ర గురించి, నేను ఎంత బాగా నటించాను అనేది చెప్పారు. అది ఇండస్ట్రీలో బాగా రీచ్ అయ్యింది. నేను విలన్ పాత్రల్లో నటించినా బాగుంని చెబుతుంటారు. గ్రే క్యారెక్టర్స్ చేసినా బాగుంటుందని అంటారు. ప్రేక్షకుల నుంచి వచ్చేది స్పందన నిజాయితీగా ఉంటుంది. ఈ మధ్య వచ్చిన ‘విరాటపర్వం’లో నా రోల్ పెంచాల్సింది అనే కామెంట్స్ కూడా వచ్చాయి” అని అన్నారు.