తెలుగు చిత్ర పరిశ్రమకు సంక్రాంతి సీజన్ చాలా పెద్దది. ఈ సమయంలో బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల జాతర జరుగుతుంది. పెద్ద, చిన్న చిత్రాలన్నీ విడుదలవుతాయి. ఈ సమయంలో భారీ సినిమాల క్లాష్‌లు రాకుండా, వసూళ్లకు గండి పడకుండా ఉండేందుకు తెలుగు పెద్ద సినిమాలు ఇటీవలే ఒక అవగాహనకు వచ్చి, విడుదల తేదీలను మరోమారు ఖరారు చేసుకున్నాయి. ఈ క్రమంలో మధ్యలో నుంచి ‘భీమ్లా నాయక్’ను తప్పించారు. ఇక కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాల అనిశ్చితి తర్వాత థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యాయి పెద్ద సినిమాలు. అయితే మరోమారు సినిమా ఇండస్ట్రీని కొత్త కోవిడ్ -19 వేరియంట్ భయపెడుతోంది.
భారతదేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్యతో మహారాష్ట్ర ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. వీటిలో కొన్ని ఆంక్షలు సంక్రాంతికి రాబోతున్న మన పాన్ ఇండియా సినిమాలు ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ సినిమాలను ప్రభావితం చేస్తాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రి 9 నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. అంతేకాదు థియేటర్లు మొత్తం ఆక్యుపెన్సీలో 50 శాతం మాత్రమే, గరిష్టంగా రోజుకు మూడు షోలను మాత్రమే ప్రదర్శించాలని ఆదేశించింది. ఈ నిబంధనలు ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’లను ప్రభావితం చేయవచ్చు. ఎందుకంటే వారు ముంబైలో సినిమా విడుదలపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ మేరకు అక్కడే ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తున్నారు కూడా.
క్రిస్మస్, కొత్త సంవత్సరం, ఇతర ఈవెంట్ల సందర్భంగా ఈ ఆంక్షలు నిరవధికంగా ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్ ‘, ‘రాధే శ్యామ్’లకు ఇది పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఈ సినిమాల స్టార్స్ ఇప్పటికే విరామం లేకుండా తమ తమ చిత్రాలను ప్రమోట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒమిక్రాన్ విజృంభిస్తే వారి శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది. ఈ పరిస్థితి ఒక విధంగా రెండు చిత్రాల టీంలను టెన్షన్ పెట్టేదే ! మరి ఏం జరుగుతోందో వేచి చూడాలి.