ఏపీలో ప్రస్తుతం ఉన్న టిక్కెట్ రేట్లతో థియేటర్లను నిర్వహించలేమంటూ కొంతమంది ఎగ్జిబిటర్స్ వాటిని మూసివేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ‘భీమ్లా నాయక్’ సినిమాను సైతం వారు ప్రదర్శించడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. అయితే… ఈ విషయంలో గ్రౌండ్ రియాలిటీ వేరే ఉందనే వాదన వినిపిస్తోంది. ‘అత్యధిక రేట్లకు టిక్కెట్స్ ను అమ్ముకోనిస్తేనే థియేటర్లను నడుపుతాం తప్పితే, ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు నడపమని ఎగ్జిబిటర్లు చెబుతున్నట్టే దీనిని అర్థం చేసుకోవాలని కొందరంటున్నారు. నిజం చెప్పాలంటే ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాను ప్రదర్శిస్తే, థియేటర్లకు వచ్చే నష్టం ఏమీ ఉండదని, వారికి ఇలాంటి సినిమాలను లాభాల పంటనే పండిస్తాయని వారు చెబుతున్నారు. వారి వాదన ఇలా ఉంది… ఇవాళ విడుదలైన ‘భీమ్లా నాయక్’ సినిమాకు ప్రేక్షకుల నుండి విపరీతమైన క్రేజ్ ఉంది. దాంతో థియేటర్లు హౌస్ ఫుల్ కావడం ఖాయం. పైగా ఇప్పుడు ఏపీలో నూరు శాతం ఆక్యుపెన్సీకీ ఛాన్స్ ఉంది. థియేటర్లు జనంతో కిటకిటలాడే సమయంలో వాటిని మూసివేస్తామనడంలో అర్థం ఏమిటీ? అన్నది వారి ప్రశ్న.
Read Also : Bheemla Nayak : బావ సినిమాకి వచ్చా… పూనమ్ స్క్రీన్ షాట్ వైరల్
‘భీమ్లా నాయక్’కు హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో టిక్కెట్ ధర తక్కువ ఉంటే అభిమానులు మళ్ళీ మళ్ళీ వచ్చి ఆ సినిమాను చూసే ఆస్కారం ఉంటుంది. సో…. తక్కువ రేటు పెట్టినా, ప్రేక్షకుల ఆదరణ లభించిన సినిమాలకు, స్టార్ హీరోస్ సినిమాలకు కలెక్షన్స్ బాగానే ఉంటాయి. కానీ… తక్కువ రేట్లకు ఎట్టి పరిస్థితుల్లో సినిమాను జనంకు చూపించకూడదనే మొండి పట్టుదలతోనే కొందరు ఎగ్జిబిటర్స్ థియేటర్లు మూసేస్తున్నారని వారు అంటున్నారు. నిజానికి ఒక థియేటర్ ను దాని ఓనర్.. లీజుకు ఇచ్చిన తర్వాత అతనికి అద్దె లభిస్తుంది తప్పితే, టిక్కెట్ రేట్ల హెచ్చుతగ్గులతో ఎలాంటి సంబంధం ఉండదు. కానీ లీజుదారుడు మాత్రం… మొదటి వారంలోనే అత్యధిక మొత్తాన్ని జనం నుండి కొల్లగొట్టడం కోసం భారీగా టిక్కెట్ రేట్లను పెంచాలని కోరుకుంటాడు. సో… సినిమాలను అత్యధిక రేట్లకు కొనుక్కున్న బయ్యర్లకు, వారిలోని లీజుదారులకే టిక్కెట్ రేట్లు తక్కువగా ఉంటే నష్టం, బాధ. అలాంటి వారే కొంత కాలంగా టిక్కెట్ రేట్ తక్కువగా ఉంటే థియేటర్లను నిర్వహించలేమనే వంకతో లీజును రద్దు చేసుకుంటున్నారు. అంటే అర్థం… థియేటర్లు లాభాలతో నడిస్తే తమకు వాటిని ఇవ్వాలి. ఒకవేళ లాభాలు ఆశించిన స్థాయిలో రాకపోతే… వాళ్ళు థియేటర్లను వదిలేస్తారు. నిజం చెప్పాలంటే… స్టార్ హీరోల సినిమాలు తక్కువ రేట్ల కారణంగా భారీ వసూళ్ళు చేసే ఆస్కారం కూడా ఉంటుందని, దానికి ‘అఖండ’ చిత్ర విజయమే నిదర్శనమని, తక్కువ టిక్కెట్ రేట్లతో ఆ సినిమా అఖండ విజయాన్ని సాధించినప్పుడు, ‘భీమ్లా నాయక్’ను ప్రదర్శించలేమని చెప్పడం సబబు కాదని కొందరు అంటున్నారు!