Aryan Gowra: ప్రతి సినిమాలోనూ ఏదో ఒక చోట ప్రేమ అనేది ఉంటుంది. అయితే ప్రేమే కథా వస్తువుగా ఉండే సినిమాలూ కొన్ని ఉంటాయి. ప్రేమ కథా చిత్రాలకు యూత్ ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తుంటుంది. అందుకే మేకర్లు లవ్ స్టోరీలను తెరకెక్కించేందుకు మక్కువ చూపుతుంటారు. అలాంటి ప్రేమకథా చిత్రమే ‘ఓ సాథియా’. విశేషం ఏమంటే ఈ సినిమాకు దర్శకనిర్మాతలిద్దరూ మహిళలే! తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు.
‘జీ జాంబి’ సినిమాతో హీరోగా పరిచయమైన ఆర్యన్ గౌర ఇందులో కథానాయకుడిగా పాత్రను పోషిస్తున్నాడు. ఓ వైపు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూనే సినిమాల మీద మక్కువతో అతను ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆర్యాన్ గౌర మొదటి సినిమా ‘జీ జాంబి’తోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు రెండో సినిమా ‘ఓ సాథియా’ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఆర్యాన్ గౌరకు జోడిగా మిస్తీ చక్రవర్తి నటించారు. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలోకి వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో ఎంతగానో ఆదరణను దక్కించుకుంది. గతంలో రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్, వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘వెళ్లిపోయే’ పాటలకు మంచి స్పందన లభించింది. దాంతో సహజంగానే మూవీ మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. దానిని నిలుపుకునేలా మూవీ ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.