NTR30 Makers Approached Vijayashanti For Key Role: జూ. ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే! నిజానికి.. ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్లాల్సింది. కానీ, ఆర్ఆర్ఆర్ కారణంగా వాయిదా పడింది. ఇక ఆ సినిమా పుణ్యమా అని తారక్‌కి పాన్ ఇండియా క్రేజ్ రావడంతో, స్క్రిప్టుకు మెరుగులు దిద్దేందుకు కొరటాల మరింత సమయం తీసుకున్నాడు. పాన్ ఇండియా అప్పీల్ తీసుకురావడం కోసమే, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు స్క్రిప్ట్ పనులు దాదాపు కొలిక్కి వచ్చేశాయని, ప్రాజెక్ట్‌ని సెట్స్ మీదకి తీసుకెళ్లేందుకు మేకర్స్ సమాయత్తమవుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే కీలక పాత్రల కోసం నటీనటుల్ని ఎంపిక చేసే ప్రక్రియను మేకర్స్ ప్రారంభించారని తెలిసింది.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. ఇందులో ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం లేడీ అమితాబ్ విజయశాంతిని మేకర్స్ సంప్రదించారట! చివరిసారిగా ఈమె మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కనిపించింది. అందులో ఆమె పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, అంతే ప్రాముఖ్యత ఈ NTR30లో ఉంటుందని ఇన్‌సైడ్ న్యూస్! అందుకే, ప్రత్యేకించి ఈ పాత్ర కోసం విజయశాంతినే సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇందులో ఎంతవరకు నిజముందో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే, విజయశాంతి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. కచ్ఛితంగా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ తోడైనట్టే! కాగా.. ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో సెట్స్ మీదకి తీసుకెళ్లనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో హీరోయిన్‌ని కూడా ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది.