విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావును జనం ‘అన్న’గా అభిమానించారు, ఆరాధించారు, ‘అన్న’ అనే అభిమానంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయనను ముఖ్యమంత్రిగానూ నిలిపారు. అంతలా యన్టీఆర్ ‘అన్న’గా జనం మదిలో ముద్రవేశారు. అంతకు ముందు ఎన్ని చిత్రాలలో యన్టీఆర్ అన్న పాత్రల్లో నటించి అలరించినా, ఆయనకు ‘అన్న’గా తరిగిపోని, చెరిగిపోని స్థానం కల్పించిన సినిమా ‘రక్తసంబంధం’ అనే చెప్పాలి. అనేక చిత్రాలలో యన్టీఆర్ కు హిట్ పెయిర్ గా అలరించిన సావిత్రి, ఈ సినిమాలో ఆయనకు చెల్లెలుగా నటించినా, ఇద్దరూ అన్నాచెల్లెళ్ళుగా తమ పాత్రల్లో జీవించారు. అందుకే ‘రక్తసంబంధం’ దుఃఖాంత చిత్రమే అయినా, రజతోత్సవాలు చేసుకొనేంత ఘనవిజయం సాధించింది. వి.మధుసూదనరావు దర్శకత్వంలో సుందల్ లాల్ నహతా, డూండీ నిర్మించిన ఈ చిత్రం 1962 నవంబర్ 1న విడుదలై విజయఢంకా మోగించింది.
తమిళంలో శివాజీగణేశన్, సావిత్రి అన్నాచెల్లెళ్ళుగా నటించిన ‘పాశమలర్’ ఈ చిత్రానికి మాతృక! ఈ కథ విషయానికి వస్తే- చిన్నతనంలోనే కన్నవారిని పోగొట్టుకున్న, రాజశేఖర్, రాధ ఒకరికి ఒకరు తోడుగా జీవిస్తూంటారు. చెల్లెలు రాధ అంటే రాజుకు ప్రాణం. అన్న రాజు అంటే రాధకు దైవసమానం. పేదరికంలో మగ్గుతూనే చెల్లెలును బంగారంలా చూసుకుంటూ ఉంటాడు రాజు. జీవనం కోసం ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రాజుకు, అక్కడే పనిచేసే ఆనంద్ మంచి మిత్రుడవుతాడు. రాజు వల్ల రాధకు ఆనంద్ పరిచయం అవుతాడు. అంతకు ముందే ఓ సారి రాధ ఆవును పట్టించడంలో ఆమెకు ఆనంద్ సాయం చేసి ఉంటాడు. తరువాత వారిద్దరూ మనసులు ఇచ్చి పుచ్చుకుంటారు. రాజు పనిచేసే ఫ్యాక్టరీ మూతపడుతుంది. ఆ సమయంలో రాధ అప్పటి దాకా కూడపెట్టిన డబ్బుతో అన్నాచెల్లెలు బొమ్మలు చేయడం మొదలు పెట్టి ఒక్కోమెట్టూ ఎక్కుతూ లక్షలు గడిస్తారు. తాను పనిచేసిన ఫ్యాక్టరీనే రాజు కొనుగోలు చేస్తాడు. ఆనంద్ ఇంట్లో పెంచిన అత్త, ఆమె కొడుకు చెప్పడంతో అతనికి ఇష్టం లేకపోయినా, రాజును కలుసుకొని ఉద్యోగం కోరతాడు. తన మిత్రుడు తన కిందే పనిచేయడం ఇష్టంలేని రాజు, మొదట తటపటాయించినా, ఆనంద్ కోసం సరే ఈ ఫ్యాక్టరీలో నీకు నచ్చిన ఉద్యోగం చేయమంటాడు. రాధతో ఆనంద్ చనువుగా ఉండడం రాజు చూసి అతడిని కొడతాడు. ఆనంద్ తో చనువుగా ఉండే వర్కర్స్ ను పనిలోంచి తీసేస్తాడు రాజు. వారి పక్షాన నిలచి ఆనంద్ పోరాటం చేస్తాడు. రాధను తనతో రమ్మంటాడు ఆనంద్. అందుకు ఆమె అంగీకరించదు. తన అన్నకు అప్రతిష్ఠ చేసే ఏ పనీ చేయనని చెబుతుంది. తనపై చెల్లెలుకు ఉన్న ప్రేమను గ్రహించిన రాజు, ఆమెకు నచ్చిన ఆనంద్ తోనే పెళ్ళి జరిపిస్తాడు. అంతకు ముందు ఓ లాయర్ ను రాధకు, ఆయన చెల్లెలు డాక్టర్ మాలతితో తనకు సంబంధం కుదుర్చుకు వచ్చి ఉంటాడు రాజు. వారికి క్షమాపణ చెబుతాడు. అయితే రాధ వెళ్ళి మాలతిని, ఆమె అన్నను క్షమించమని వేడుకొని, తన అన్నకు మాలతితో పెళ్ళి జరిగేలా చేస్తుంది. ఆనంద్ తో పాటే ఆయన మేనత్త, ఆమె కొడుకు కూడా రాజు ఇంట్లోనే ఉంటారు. ప్రతీ పనికి ఆ గయ్యాళి మేనత్త, రాధను రాచిరంపాన పెడుతూ ఉంటుంది. ఆమె కారణంగా ఓ సారి రాధపై ఆనంద్ చేయి చేసుకుంటాడు. అక్కడే ఉన్న రాజు, ఆనంద్ ను కొడతాడు. ఇక కలసి ఉండడం కల్ల అంటాడు ఆనంద్. ఆస్తి మొత్తం చెల్లెలుకే వదిలేసి మాలతి వెంట వెళతాడు రాజు. అతనితో మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టిస్తారు. హాయిగా సాగుతూ ఉన్న సంసారంలో రాధ ఇంట సుఖశాంతులు లేవని తెలుసుకొని రాజు కుమిలి పోతాడు. రాధ ఓ బాబుకు జన్మనిస్తుంది. మాలతి ఓ పాపను కని కన్నుమూస్తుంది. ఈ విషయం తెలిసి రాజును చూడడానికి ఆనంద్ వెళతాడు. అయితే మాలతి అన్న భాస్కర్ అతడిని చూడగానే, తన చెల్లెలు చావుకు నీవు, మీ అత్తనే కారణమని నిందించి ముఖానే తలుపులు వేస్తాడు. ఆరోగ్యం బాగోలేని రాధకు ఈ విషయం తెలుస్తుంది. తన వదిన చనిపోతే, అన్న ఎలా ఉన్నాడో అని దుఃఖిస్తుంది. రాజు తన ఆస్తినంతా చెల్లెలు పేర రాసి వెళతాడు. ఆనంద్ కూడా ఆస్తి మొత్తం రాధ పేర రాసిన రాజు ఎక్కడ ఉన్నాడో అని వెతుకుతారు. కానీ, రాజు కూతురుతో పలు ఊళ్ళు తిరిగి చివరకు చెల్లెలును చూడాలని వస్తాడు. ఆనంద్ మేనత్త గయ్యాళి అతడిని గెంటేస్తుంది. బయటకు వచ్చిన రాజు, ఓ బాబు మతాబులు కాలుస్తూ ప్రమాదానికి గురైతే కాపాడబోతే, కళ్ళు పోగొట్టుకుంటాడు. అన్ని విషయాలు తెలుసుకున్న ఆనంద్ మేనత్తను ఇంట్లోంచి గెంటేస్తాడు. రాజుకు కళ్ళుపోయాయని తెలుసుకున్న రాధ కన్నీరుమున్నీరవుతుంది. తాను కాపాడింది చెల్లెలు కొడుకునే అని తెలుసుకున్న రాజు సంతోషిస్తూ పిచ్చివాడిగా గెంతులేస్తూ కన్నుమూస్తాడు. అది చూసిన రాధ కూడా చనిపోతుంది. రాజును క్షమించమని అడగడానికి వచ్చిన ఆనంద్ అతను చనిపోవడం చూసి కన్నీరు మున్నీరవుతాడు. రాధ కూడా చనిపోయిందని తెలిసి ఇక తానెందుకు బ్రతకాలని భావిస్తాడు. అయితే అక్కడున్నవారు వారిస్తారు. పిల్లలను ఎత్తుకొని ఆనంద్ విలపిస్తూ ఉండగా వారిని రాజు, రాధ ఆత్మలు దీవించడంతో కథ ముగుస్తుంది.
ఇందులో కాంతారావు, దేవిక, సూర్యకాంతం, రేలంగి, గిరిజ, రమణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కె.వి.యస్.శర్మ, వై.వి.రాజు ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రంతోనే ముళ్ళపూడి వెంకటరమణ రచయితగా పరిచయం అయ్యారు. తమిళ మాతృకకు కొన్ని మార్పులు చేశారు. అందులో హీరో భార్య కడదాకా బతికి ఉన్నట్టు చూపించారు. ఇందులో ఆ పాత్ర మధ్యలోనే కన్నుమూస్తుంది. ఆ చిత్రంలో హీరోకు కొడుకు, ఆయన చెల్లెలుకు కూతురు ఉన్నట్టు చూపగా, ఈ సినిమాలో అన్నకు కూతురు, చెల్లికి కొడుకు ఉన్నట్టు చూపించడం సందర్భోచితంగా సాగింది.
మాతృక ‘పాశమలర్’కు విశ్వనాథన్- రామమూర్తి సంగీతం సమకూర్చారు. తెలుగు చిత్రానికి కూడా వారితోనే స్వరకల్పన చేయించాలని నిర్మాతలు భావించారు. అయితే కాల్ షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఘంటసాల సంగీతం కూర్చారు. పైగా అంతకు ముందు సుందర్ లాల్ నహతా నిర్మించిన పలుచిత్రాలకు ఘంటసాల సంగీతం అందించారు. ఆ తరువాత కూడా నహతా చిత్రాలకు ఘంటసాల బాణీలు కట్టారు. అయితే “బంగారు బొమ్మ రావేమే…”, “చెందురుని మించు అందమొలికించు…”, “మంచి రోజు వస్తుంది… మాకు బతుకునిస్తుంది…” పాటలకు ఒరిజినల్ లోని ట్యూన్స్ నే అనుకరించారు. ఆరుద్ర, నారాయణరెడ్డి, కొసరాజు, అనిశెట్టి, దాశరథి పాటలు పలికించారు. ఇందులోని “ఇదే రక్తసంబంధం…”, “ఎవరో నన్ను కవ్వించి పోయే దెవరో…”, “ఆకాశమేలే అందాల రాజే…”, “ఒహో వయ్యారి వదినా…”, “అల్లారు ముద్దుగా…” అంటూ సాగే పాటలు సైతం ఆకట్టుకున్నాయి.
ఇందులో ముళ్ళపూడి ఆప్తమిత్రుడు బాపు బొమ్మలతో రేలంగిపై కొన్ని సీన్స్ చిత్రీకరించడం విశేషం! ‘రక్తసంబంధం’ చిత్రం కంటే ముందు యన్టీఆర్- సావిత్రి జంటగా రూపొందిన ‘గుండమ్మ కథ’ అదే 1962లోనే విడుదలై ఘనవిజయం సాధించింది. ‘రక్తసంబంధం’ తరువాత 43 రోజులకే యన్టీఆర్, సావిత్రి జోడీగా తెరకెక్కిన ‘ఆత్మబంధువు’ కూడా విడుదలయింది. అయినా ఆ సినిమాలూ ఘనవిజయం సాధించాయి. వారిద్దరూ అన్నాచెల్లెళ్ళుగా నటించిన ‘రక్తసంబంధం’ కూడా జైత్రయాత్ర చేసింది. మహిళలు విశేషంగా ఈ చిత్రాన్ని ఆదరించారు. చూసిన వారందరూ సినిమాలో యన్టీఆర్ లాంటి అన్నయ్య తమకూ ఉంటే బాగుండని అన్నారు. అలాంటి అన్నయ్యలున్న చెల్లెమ్మలు పదే పదే ఈ చిత్రాన్ని చూశారు. ఈ సినిమా 11 కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. విజయవాడలో రజతోత్సవం చేసుకుంది. 1988లో రిపీట్ రన్ లో ‘రక్తసంబంధం’ హైదరాబాద్ లో మరోమారు శతదినోత్సవం చేసుకోవడం విశేషం! ఈ సినిమా తరువాత కూడా యన్టీఆర్ అన్నగా నటించిన ‘ఆడపడచు, చిట్టిచెల్లెలు’ వంటి చిత్రాలు జనాదరణ పొందాయి. అయితే యన్టీఆర్ అన్న పాత్ర అనగానే ఈ నాటికీ నాటి ప్రేక్షకులకు గుర్తుకు వచ్చే చిత్రంగా ‘రక్తసంబంధం’ నిలచింది. ఇప్పటికీ బుల్లితెరపై ‘రక్తసంబంధం’ ప్రదర్శితమయితే, చూసేవారెందరో ఉన్నారు.