తెలుగు చిత్రసీమలోనే కాదు, ప్రపంచ చలనచిత్రసీమలోనే ఓ అరుదైన అద్భుతం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. ఆయన జయంతి అయిన మే 28వ తేదీ అభిమానులకు ఓ పర్వదినం. 1923 మే 28న కృష్ణాజిల్లా నిమ్మకూరులో కన్ను తెరచిన యన్టీఆర్, తరువాత జనం మదిలో ‘అన్న’గా నిలచి జేజేలు అందుకున్నారు. ఆయన నటజీవితం, రాజకీయ ప్రస్థానం గమనిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక పౌరాణిక పాత్రల్లో అలరించిన ఘనత యన్టీఆర్ సొంతం. జానపదాల్లో కథానాయకునిగా అత్యధిక పర్యాయాలు ఆకట్టుకున్న వైనం కూడా రామారావు సొంతమే! ఒక పౌరాణిక పాత్ర (శ్రీకృష్ణ పాత్ర)ను 20 సార్లకు పైగా తెరపై ఆవిష్కరించిన ఘన చరిత కూడా నందమూరి ఖాతాలోనే చేరింది. తెలుగునేలపై నడయాడిన పలు చారిత్రక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసి జనం మదిలో ఆ యా పేర్లు వినగానే యన్టీఆరే మెదిలేలా చేసిన అభినయవైభవమూ ఆయనదే! ఇక సాంఘిక చిత్రాలలో అధిక శాతం సినిమాల్లో జనం పక్షం నిలచి, సామాన్యులకు అన్యాయం చేసే ధనిక వర్గాన్ని, పాలకులను ప్రశ్నించడం, అవసరమైతే తగిన శాస్తీ చేయడం వంటి కథలతోనూ నటరత్న సాగారు. ఈ విషయంలో ప్రపంచ చిత్రసీమలో మరికొందరు నటులు తారసిల్ల వచ్చు. కానీ, పౌరాణిక, జానపదాల్లో యన్టీఆర్ దరిదాపులలో అలరించిన వారు కానరారు. రామారావు నటించిన 300పై చిలుకు చిత్రాలను పరిశీలిస్తే ఈ అంశాలన్నీ మనకు ఆశ్చర్యం గొలుపుతూ కనిపిస్తాయి. అంతటి మహానటుడు యన్టీఆర్ మన తెలుగువారయినందుకు ఛాతీ విరిచి మరీ గర్వించాలి. ఇక చిత్రసీమలో యన్టీఆర్ స్థాయిలో విజయాలు చవిచూసిన వారు కూడా అరుదనే చెప్పాలి. తెలుగునాట అత్యధిక శతదినోత్సవాలు, రజతోత్సవాలు, ద్విశతదినోత్సవాలు, స్వర్ణోత్సవాలు అన్నీ ఆయన పేరిట నమోదు కావడం కూడా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. యన్టీఆర్ పలు జానర్స్ లో నటించారు కాబట్టి, ఆ తరహా విజయం ఆయన సొంతమయిందని చాలామంది భావిస్తారు. పలు వైవిధ్యమైన పాత్రల్లో నటించడం కాదు, జనాన్ని అలరించి, విజయాలను సాధించడమూ అంత సులువైన అంశం కాదు. రామారావు లాగా పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో రాణించాలని ప్రయత్నించి తరువాత లెంపలు వేసుకున్నవారు ఎందరో ఉన్నారు.
చిత్రసీమలోనే కాదు, రాజకీయ రంగంలోనూ యన్టీఆర్ నభూతో నభవిష్యత్ అన్న చందాన సాగారు. యన్టీఆర్ కంటే ముందు కొందరు నటీనటులు రాజకీయాల్లో ప్రవేశించారు. కానీ, యన్టీఆర్ లాగా ఏ పార్టీకీ కొమ్ముకాయకుండా నేరుగా సొంత పార్టీ నెలకొల్పి, అనతి కాలంలోనే తన పార్టీని విజయపథంలో పయనింప చేసిన ఘనుడు భూప్రపంచంలో మరొకరు కానరారు. తెలుగునేలపై ప్రత్యక్ష రాజకీయాల్లో తొలి అడుగు వేసిన కొంగర జగ్గయ్య, తమిళనాట రాజకీయాల్లో జయకేతనం ఎగురవేసిన ఎమ్.జి.రామచంద్రన్, అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించిన రోనాల్డ్ రీగన్, ప్రస్తుతం ఉక్రెయిన్ అధ్యక్షునిగా ఉన్న వొలోదిమిర్ జెలెన్స్కీ – ఈ నటులందరూ ఏదో విధంగా ముందు నుంచీ రాజకీయాలతో అనుబంధం ఉన్నవారే! అయితే, యన్టీఆర్ చలనచిత్రసీమలో ఉన్నంత కాలం తన చిత్రాలలో రాజకీయాలు చర్చించారేమో కానీ, ఏ నాడూ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు. పైగా 1982 మార్చి 29న పార్టీని నెలకొల్పి, 1983 జనవరి 9 నాటికి ముఖ్యమంత్రి అయ్యారు. అంటే కేవలం తొమ్మిది నెలల రెండు వారాలలో ఓ పార్టీని నెలకొల్పి, విజయకేతనం ఎగురవేయడం అన్నది కూడా ఎక్కడా కానరాదు. అదీ అంతకు ముందు ఏ విధమైన రాజకీయ అనుభవం లేకుండా! ఇలాంటి విశేషాలను తలచుకుంటూ పోతే, యన్టీఆర్ అంటేనే ఓ అద్భుతం అనిపించక మానదు.
సినిమాల్లో అయితే యన్టీఆర్ కే పలు అరుదైన రికార్డులు నెలకొని ఉండడం చూసి, ఏవో జనం మెచ్చి ఇచ్చిన విజయాలు అని భావించవచ్చు. కానీ, రాజకీయ రంగంలోనూ జనం అదే రీతిన యన్టీఆర్ ను ఆదరించడం అన్నది అబ్బురమే అనిపిస్తుంది. 1983లో యన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి 200 సీట్లు అందించిన జనం, 1984 ఆగస్టు సంక్షోభంలో ఆయనకు దన్నుగా నిలిచారు. యన్టీఆర్ బర్తరఫ్ అయిన కేవలం నెలరోజులకు తిరిగి అధికార పీఠంపై ఆయనను ప్రజలు కూర్చోబెట్టారు. 1984లో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత కొద్ది రోజులకే యన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేసి, 1985 మార్చిలో ఎన్నికలకు వెళ్ళారు. జనం మళ్ళీ యన్టీఆర్ కు 200 పైచిలుకు సీట్లు అందించడం విశేషం! అలా 1983, 1984, 1985 వరుసగా మూడు సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక నాయకుడుగా నిలిచారు యన్టీఆర్! 1989లో ప్రతిపక్షనాయకునిగా ఉన్నా, తనదైన బాణీ పలికిస్తూ, పలు సంచలనాలకు తెర తీశారు. 1994లో ఆ నాడు తెలుగునేలపై బలమైన పార్టీగా ఉండి, కేంద్రంలోనూ పెత్తనం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ఘనత సైతం రామారావుకే దక్కింది. ఆ దఫా కూడా 225 సీట్లు తెలుగుదేశానికి అందించారు జనం. ఇక 1984 పార్లమెంట్ ఎన్నికల్లో ఇందిరాగాంధీ హత్య ఫలితంగా కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా సానుభూతి పవనాలు వీచాయి. తెలుగునేలపై 33 సీట్లకు పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ 30 సీట్లు దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో ఏ జాతీయ పార్టీ కూడా డబుల్ డిజిట్ చూడక పోవడం గమనార్హం! దాంతో యన్టీఆర్ ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం కేంద్రంలోనూ ప్రతిపక్ష పాత్ర పోషించడం దేశరాజకీయాల్లోనే ఓ మరపురాని అధ్యాయం! రాజకీయ రంగంలోనూ ఇలా అనేక తరిగిపోని, చెరిగిపోని రికార్డులు నెలకొల్పిన యన్టీఆర్ ఆ రోజుల్లో ప్రవేశ పెట్టిన పలు పథకాలు ఈ నాటికీ పేర్లు మార్చుకొని జనాన్ని ఆకట్టుకొనే ప్రయత్నం చేయడం గమనార్హం! అప్పట్లో 1989 ఎన్నికలకు ముందు ఒక్కసారిగా తన మంత్రివర్గాన్ని రద్దు చేసి, కొత్త వారికి చోటు కల్పించడం సంచలనం రేకెత్తించింది. కొందరు యన్టీఆర్ ను రాజకీయ అజ్ఞాని అనీ దూషించారు. ఏదో సినిమాల్లో ముఖానికి రంగులు పూసుకున్నవాడు అన్నారు. ఎన్ని అన్నా, భారతదేశంలో రాజకీయ చైతన్యం కలగడానికి యన్టీఆర్ కారకులని చెప్పక తప్పదు. అందుకు 1983లో యన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో సాధించిన విజయం ఓ కారణమైతే, 1984లో ఆయన బర్తరఫ్ తద్వారా సంభవించిన ఫలితాలు మరో కారణమని అంగీకరించక తప్పదు.
అటు చిత్రసీమలోనూ, ఇటు రాజకీయాల్లోనూ ఇప్పటికీ యన్టీఆర్ చూపిన పంథాలోనే కథానాయకులు, రాజకీయనాయకులు పయనించాలని అభిలషించడం చూస్తోంటే… యన్టీఆర్ ఓ అద్భుతం అనకుండా ఉండలేం!