ఇప్పటికే యంగ్ టైగర్ యన్టీఆర్.. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్‌తో కూడా సినిమా ఫిక్స్ అయిపోయిందని తెలుస్తోంది. ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాత నిర్మించబోతున్నారట. అలాగే ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ టైటిల్ లాక్ చేసినట్టు సమాచారం. మరి ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో.. ఏ డైరెక్టర్‌తో ఉండబోతోంది..! ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ టైటిల్ ఏంటి..!
ఆర్ఆర్ఆర్ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేయబోతున్నారు ఎన్టీఆర్. కొరటాల శివతో ఎప్పుడో కమిట్ అయినా NTR30 ప్రాజెక్ట్ అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR31 సినిమా మొదలు కాబోతోంది. తాజాగా ఈ సినిమాకు టైటిల్ లాక్ అయినట్టు తెలుస్తోంది. ముందుగా వినిపించినట్టుగానే ‘అసురుడు’ అనే పేరునే ఖరారు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించబోతున్నారట. అంతేకాదు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ ను కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూపించబోతున్నారట. అందుకే అసురుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారని టాక్. గతంలో జై లవ కుశ సినిమాలో కూడా విలన్ షేడ్స్ ఉన్న పాత్ర చేశాడు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి రోల్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రశాంత్ నీల్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే ప్రాజెక్ట్ కూడా ఫిక్స్ అయిపోయిందని వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్.. ప్రస్తుతం రామ్ చరణ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడని గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియరాలేదు. కానీ లేటెస్ట్ అప్టేట్ ప్రకారం ఈ క్రేజీ కాంబినేషన్ ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ సినిమాని కూడా దిల్ రాజే నిర్మించబోతున్నారట. ఈ మధ్య దిల్ రాజుకు శంకర్ మరో అదిరిపోయే కథ వినిపించాడట. అది ఆయనకు బాగా నచ్చిందని, ఆ కథతోనే యన్టీఆర్‌తో సినిమా తీయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దిల్ రాజు ఎన్టీఆర్‌తో సినిమా ఉంటుందని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో.. శంకర్‌తోనే ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఆర్సీ 15 అయిపోయిన తర్వాత.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ మొదలు పెట్టే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే ఇందులో నిజమెంత ఉందో తెలియాలి అంటే.. అనౌన్స్ మెంట్ వరకూ ఆగాల్సిందే.