Samajavaragamana: ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ ‘సామజవరగమన’. ఏప్రిల్ 27న ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఆ సందర్భంగా సినిమాను మే 18న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ మళ్ళీ ఇంతవరకూ రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్ లేదు. శ్రీవిష్ణు కథానాయకుడిగా ‘వివాహభోజనంబు’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండా ఈ సినిమాను నిర్మించారు.
భారీ అంచనాలతో వచ్చిన ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ వారి ‘ఏజెంట్’ మూవీ బాక్సాఫీస్ బరిలో భారీ పరాజయాన్ని పొందడంతో ఆ ప్రభావం ఈ సినిమా మీద పడిందనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. దానికి తోడు ‘రాజ రాజ చోర’ తర్వాత శ్రీవిష్ణు నటించిన ‘భళా తందనాన’, ‘అర్జున ఫాల్గుణ’, ‘అల్లూరి’ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అది కూడా ‘సామజవరగమన’పై ఎంతో కొంత ప్రభావం చూపించే ఆస్కారం లేకపోలేదు. అయితే… శ్రీవిష్ణు గత చిత్రాలతో పోల్చితే ‘సామజవరగమన’ మూవీ టీజర్ కు మంచి స్పందన లభించింది. వినోద ప్రధానంగా సాగిన ఈ టీజర్ తో మూవీపైన అంచనాలూ బాగానే పెరిగాయి. దాన్ని అలానే పెంచుకుంటూ పోకుండా… సినిమా విడుదలను వాయిదా వేయడం, అది ఎప్పుడో చెప్పకపోవడంతో శ్రీవిష్ణు అభిమానులు సైతం నిరాశకు గురవుతున్నారు. రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘు బాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం సమకూర్చారు. మరి ఈ కామెడీ ఎంటర్ టైనర్ కు సంబంధించిన లేటెస్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.