సౌతిండియన్ స్టార్ హీరో ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య విడాకుల వ్యవహారం గురించిన చర్చ జోరుగా సాగుతుండగానే… జాతీయ మీడియాలో ఇప్పుడు మరో డైవర్స్ ఇష్యూ హల్చల్ చేస్తోంది. ‘మహాభారత్’ టెలివిజన్ సీరియల్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్రీకృష్ణ పాత్రధారి నితీశ్ భరద్వాజ్ సైతం పన్నెండేళ్ళ తర్వాత తన భార్య స్మిత ఘటె కు విడాకులు ఇస్తున్నాడు. 2019 సెప్టెంబర్ నుండి నితిష్ – స్మిత విడివిడిగా ఉంటున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ అయిన స్మిత తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇండోర్ లో ఉంటున్నారు.
అయితే ముంబై లోని ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లయ్ చేశామని నితిశ్ తెలిపాడు. వివాహ వ్యవస్థ పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని, కానీ అది తనకు అచ్చిరాలేదని ఓ మీడియా సంస్థకు చెబుతూ వాపోయాడు. ఒకోసారి విడాకులు తీసుకోవడం అనేది మరణాన్ని మించి బాధిస్తుందని, కొన్ని సందర్భాలలో కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదని అన్నాడు. చిత్రం ఏమంటే… బీజేపీ పార్లమెంట్ సభ్యుడిగానూ పనిచేసిన నితీశ్ భరద్వాజ్ కు ఇది రెండో వివాహం. ఆయన 1991లో అప్పటి ‘ఫెమినా’ పత్రిక సంపాదకురాలు విమలా పాటిల్ కుమార్తె మోనీషాను పెళ్ళి చేసుకుని, అనంతరం 2005లో విడాకులిచ్చారు. ఆ తర్వాత 2009లో స్మిత ఘటె ను పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు, రెండో భార్య ద్వారా ఇద్దరు పిల్లలు నితీశ్ కు ఉన్నారు.