Nikhil Siddhartha: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ‘కార్తికేయ 2’తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 121 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది. అంతేకాదు… నిఖిల్ ను పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. ‘కార్తికేయ-2′ చిత్రం టీవీ ప్రీమియర్, ఓటీటీ స్ట్రీమింగ్ లో కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రశంసలు, వసూళ్లు మాత్రమే కాకుండా అవార్డుల విభాగంలోనూ నిఖిల్ తన సత్తాను నిరూపించుకున్నాడు. తాజాగా’ కార్తికేయ-2′ చిత్రంతో, ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ 2023లో నిఖిల్ సిద్ధార్థ ఉత్తమ నటుడిగా (పాపులర్ ఛాయిస్) ఎంపికయ్యారు.
‘కార్తికేయ – 2’ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంతో చందు మొండేటి కృష్ణ తత్వాన్ని, మహిమను చెప్పడంతో పాటు, పురాణ ఇతిహాసాల్లో చెప్పిన ప్రతి అంశం శాస్త్రీయమైనదేనని బలంగా చాటాడు. ఇదిలా ఉంటే… ‘కార్తికేయ 2′ తర్వాత వచ్చిన నిఖిల్ సిద్ధార్థ్ ’18 పేజీస్’ మూవీ సైతం చక్కని విజయాన్ని అందుకుంది. నిఖిల్ ప్రస్తుతం తన తదుపరి పాన్ ఇండియా చిత్రం ‘స్పై’ పై దృష్టి పెట్టాడు. ఈ సినిమా ఐదు భాషల్లో రానుంది.