Nikhil Siddharth Denies Those Rumours: కొంతకాలం నుంచి యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మీద ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. స్క్రిప్టులో ఎక్కువగా వేలు పెడతాడని, మరీ ముఖ్యంగా సెట్స్ మీదకి తీసుకెళ్లాక చాలా మార్పులు సూచిస్తాడన్నదే ఆ టాక్! ‘కార్తికేయ 2’ విషయంలో అదే రిపీట్ చేశాడంటూ ఈమధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే.. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు. ‘‘ఒక్కోసారి స్క్రిప్ట్‌ని ఫైనల్ చేశాక, సెట్స్ మీదకి తీసుకెళ్లిన తర్వాత మళ్లీ మార్పులు చేస్తారు. అలా చేయడం నాకు ఎంతమాత్రి ఇష్టముండదు. అలా చేస్తే నాకు వెంటనే కోపమొస్తుంది. కథని ఎందుకు మార్చారు? అని ప్రశ్నిస్తే, స్క్రిప్ట్ విషయంలో జోక్యం చేసుకుంటానన్న ప్రచారం చేస్తున్నారు’’ అని నిఖిల్ చెప్పుకొచ్చాడు. ఇకపై కథ ఓకే చేశాకే సినిమా స్టార్ట్ చేయాలన్న నిర్ణయానికి వచ్చానని, ఆ తర్వాత మార్పులంటే చేయకూడదని ఫిక్స్ అయ్యానన్నాడు.
ఇక ‘కార్తికేయ 2’ సినిమా ద్వాపర యుగానికి, ద్వారక నగరానికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ అల్లుకున్న కథతో సాగుతుందని నిఖిల్ చెప్పాడు. అయితే.. ఈ సినిమా విడుదల తనని చాలా టెన్షన్ పెట్టేసిందని వెల్లడించాడు. ఈ సినిమాకి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ నుంచి భారీ ఆఫర్స్ వచ్చాయని, ఇది థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా కాబట్టి సరైన సమయం కోసం నిర్మాతలు వెయిట్ చేస్తూ వచ్చారన్నాడు. ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్‌ను థియేటర్స్‌లో చూస్తున్నప్పుడే.. ఆ అనుభూతి పొందగలరన్నాడు. అందుకే, థియేటర్స్‌లో విడుదల చేయాలనే పట్టుదలతోనే ఇక్కడిదాకా వచ్చామన్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నకొద్దీ ఎంగ్జైటీ పెరిగిపోతోందని చెప్పాడు. గతంలో వచ్చిన కార్తికేయ సినిమాకి ఇది సీక్వెల్ కావడంతో.. సహజంగానే ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయన్నాడు. ఆ అంచనాలకి తగినట్టుగానే ఈ సినిమా ఉంటుందని, అందులో ఏమాత్రం సందేహం లేదని ‘కార్తికేయ 2’పై నమ్మకం వెలిబుచ్చాడు.