Nia Tripathi:చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఉన్నత చదువులు చదివిన వాళ్లు కూడా నటన మీద ఆసక్తితో సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు. సినీ వారసుల సంగతి పక్కన పెడితే, సాధారణ కుటుంబాల్లోని వారూ ఫిల్మ్ ఇండస్ట్రీని చూజ్ చేసుకుంటున్నారు. అలా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో ఇంజనీరింగ్ చేసి, ఆపైన బెంగళూరులో ఎంబీఏలో ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్‌లో శిక్షణ తీసుకుని చివరకు మోడల్ కమ్ యాక్టర్ గా సెటిల్ అయ్యింది నియా త్రిపాఠి. మధ్యప్రదేశ్ కు చెందిన నియా మోడలింగ్ నుండి అడ్వర్టైజ్ మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. మలబార్ గోల్డ్, సంతూర్ తదితర ప్రకటనల్లో నటించింది. ఇప్పుడు తొలిసారి ఆమె తెలుగులో రూపుదిద్దుకుంటున్న ‘బలమెవ్వడు’ సినిమాతో నటిగా ఎంట్రీ ఇస్తోంది.
టాలీవుడ్ ఛాన్స్ గురించి చెబుతూ, ”ముంబైలో మోడలింగ్ కెరీర్ తర్వాత నేను హైదరాబాద్‌లో కొద్దిరోజులు ఉన్నాను. ఆ టైంలో ఆడిషన్స్ ఇచ్చాను. కాస్టింగ్ డైరెక్టర్ మల్లికార్జున్ గారు నా ప్రొఫైల్‌ని డైరెక్టర్ సత్య రాచకొండకు, టీమ్ కు పంపారు. కొద్ది రోజులకే సినిమాలోని ఓ సీన్ రిహార్సల్ చేసి పంపమన్నారు. అది నచ్చడంతో నాకు అవకాశం ఇచ్చారు. ‘బలమెవ్వడు’ మూవీలో చాలా అంశాలను టచ్ చేశారు. అయితే అందులో ప్రధానమైంది మెడికల్ మాఫియా. ఇందులో నేను పోషించిన పాత్ర పేరు పరిణిక. ఆమె మెచ్యూర్డ్ గర్ల్. తన జీవితంలోనే పెద్ద ఫైటర్. ఆమెకు కాన్సర్ ఉంటుంది. అలాంటి ఓ అమ్మాయి మెడికల్ మాఫియాతో ఎలా పోరాడిందనే అంశాన్ని దర్శకులు చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు” అని తెలిపింది.
ఈ పాత్ర కోసం గుండు కొట్టించుకోవడానికి తాను సిద్ధపడ్డానని నియా త్రిపాఠి చెబుతూ, ”సినిమాలో నా పాత్రకు ఉన్న ప్రాధాన్యం నాకు తెలుసు. ఎందుకంటే కాన్సర్ పేషంట్ గా నటించేటప్పుడు చాలా ఎమోషన్స్‌ను అనుభవించాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ పాత్ర కోసం దర్శకుడు నన్నుగుండు కొట్టించుకోమన్నారు. దానికి నేను కూడా అంగీకరించాను. కానీ కంటిన్యూటి సమస్య కారణంగా టీమ్ పునరాలోచన చేసి మేకప్‌తో వెళ్తామని చెప్పారు. కాబట్టి నాకు గుండె కొట్టించుకోవాల్సిన అవసరం రాలేదు. బట్ ఆ మేకప్ తో నన్ను నేను చూసుకున్నప్పుడు, జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ సమయంలో నా మనసులో చాలా ఆలోచనలు రన్ అయ్యాయి. అసలు క్యాన్సర్ పేషెంట్లు నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు? ఎంత మానసిక ఒత్తిడిని లోనవుతారు? అనేది తలుచుకుంటే భయం వేసింది” అని చెప్పింది.
తెలుగులో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఇష్టమైన హీరోలని, హీరోయిన్లలో సమంత, సాయిపల్లవి అంటే అభిమానమని నియా త్రిపాఠి తెలిపింది. డాన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతూ, ”శయమాక్ దవర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నాను. చాలా డ్యాన్స్ ఫామ్స్ ట్రై చేస్తున్నాను. కాన్ టెంపరరీ, హిప్ హాప్, జాజ్, సల్సా లో కూడా శిక్షణ పొందాను. ప్రేక్షకులందరికీ నా డాన్స్ ప్రతిభను చూపించాలని ఉంది. అలాంటి ఓ పాత్ర కోసం ఎదురు చూస్తున్నాను. ప్రస్తుతం హిందీలోనూ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాను” అని చెప్పింది. మరి అక్టోబర్ 1న జనం ముందుకు వస్తున్న ‘బలమెవ్వడు’ చిత్రం నియా త్రిపాఠికి ఎలాంటి గుర్తింపును తెచ్చిపెడుతుందో చూడాలి.