NTV Telugu Site icon

Tollywood: ‘మైఖేల్’తో మొదలు… ఇక తగ్గేదే లే!

P

P

Pan India: గత యేడాది తెలుగు నుండి ఐదారు పాన్ ఇండియా చిత్రాలు విడుదల కాగా… ఈ యేడాది దానికి నాలుగు రెట్ల పాన్ ఇండియా సినిమాలు సెట్స్ పై డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నాయి. తెలుగు పాన్ ఇండియా సినిమాల జాతర ఫిబ్రవరి 3న సందీప్ కిషన్ ‘మైఖేల్’ మూవీతో మొదలు కానుంది. రంజిత్ జయకోడి దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ మీనన్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. దీని వెనుకే మరో తెలుగు పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ ఫిబ్రవరి 17న విడుదల కాబోతోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ -2’ వెబ్ సీరిస్ తో పాటు, గత యేడాది ‘యశోద’తో సమంతకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపే వచ్చింది. అందుకే ఈ సినిమాను గుణశేఖర్ ‘త్రీ-డీ’లోనూ అందించే ప్రయత్నంచేస్తున్నారు. అదే వారం మరో తెలుగు పాన్ ఇండియా మూవీ ‘ధమ్కీ’ కూడా జనం ముందుకు వెళుతోంది. విశ్వక్ సేన్ నటించి, నిర్మించడంతో పాటు ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించాడు. ఆ రకంగా ఫిబ్రవరి మాసంలోనే మన నుండి మూడు పాన్ ఇండియా చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దసరా’ మార్చి నెల 30న రిలీజ్ అవుతోంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ సోషల్ లో హల్చల్ చేస్తోంది. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా మూవీగా ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కుతోంది. ఏప్రిల్ నెలలోనే సాయిధరమ్ తేజ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘విరూపాక్ష’, మాస్ మహరాజా రవితేజ మొదటి పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’ రాబోతున్నాయి. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ… యంగ్ హీరో తేజ సజ్జాతో తెరకెక్కిస్తున్న ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’ మే 12న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ టీజర్ విడుదల సమయంలో చిత్ర బృందం అయోధ్యను సందర్శించడం విశేషం. ఇక ‘కార్తికేయ-2’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ సిద్ధార్థ్ తన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘స్పై’ను సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు. గత యేడాదే విడుదల కావాల్సిన అఖిల్ అక్కినేని పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’ ఇప్పుడు నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇది కూడా వేసవి కానుకగా జనం ముందుకు రానుంది.

యంగ్ హీరోస్ మాత్రమే కాదు… యంగ్ స్టార్స్, సీనియర్ స్టార్స్ కూడా పాన్ ఇండియా చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ‘పుష్ప’తో తన సత్తాను జాతీయ స్థాయిలో చాటిన అల్లు అర్జున్ ‘పుష్ప -2’ షూటింగ్ లో పాల్గొంటుండగా, రామ్ చరణ్ – శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న తొలిపాన్ ఇండియా మూవీ సెట్స్ పై ఉంది. రామ్ తో బోయపాటి కూడా ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దీని షూటింగ్ సైతం జరగుతోంది. ‘మేజర్’ మూవీతో ఉత్తరాది వారిని మెప్పించిన అడివి శేష్ ‘గూడఛారి -2’ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ‘లైగర్’తో గత యేడాది పెద్దంతగా మెప్పించలేకపోయిన విజయ్ దేవరకొండ… అతి త్వరలోనే తన ‘ఖుషీ’ మూవీని తిరిగి పట్టాలెక్కించబోతున్నాడు. ‘ఘాజీ’, ‘రామ్ సేతు’ చిత్రాలతో ఉత్తరాదిలోనూ గుర్తింపు పొందిన సత్యదేవ్ ‘జీబ్రా’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. సమ్ థింగ్ స్పెషల్ మూవీస్ ను తెరకెక్కించడంలో దిట్ట అయిన తరుణ్ భాస్కర్ ఇప్పుడు ‘కీడా కోలా’ పేరుతో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.

సీనియర్ స్టార్ హీరోస్ చిరు, బాలయ్య, నాగార్జునలను దాటి వెంకటేశ్ ‘సైంధవ్’ అనే పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మంచు మనోజ్ సైతం కాస్తంత గ్యాప్ తర్వాత ‘వాట్ ది ఫిష్’ అనే పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ పాన్ ఇండియా మూవీ ‘శబరి’ నటించింది. అలానే ‘6టీన్స్’కు సీక్వెల్ గా ‘రిస్క్’ అనే పాన్ ఇండియా మూవీ రాబోతోంది. రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా ఫస్ట్ కాంబోతో తెరకెక్కబోతున్నది కూడా పాన్ ఇండియా మూవీనే అని చెబుతున్నారు. ‘ట్రిపుల్ ఆర్’ తర్వాత ఎన్టీయార్… కొరటాల డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. మహేశ్ తో రాజమౌళి తీయబోయేది కూడా పాన్ ఇండియా చిత్రమనే ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే… ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ‘ఆదిపురుష్, సలార్’ మూవీస్ చేస్తున్నాడు. అయితే వీటి నిర్మాతలు, దర్శకులు పరభాష వారు. బట్… ప్రభాస్, మారుతీ కాంబినేషన్ తెరకెక్కుతున్న ‘రాజా డీలక్స్’ను అదర్ లాంగ్వేజెస్ లోనూ డబ్ చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాలన్నీ నాలుగు, ఐదు లాంగ్వేజెస్ లో విడుదల కాబోతుండగా, మన హీరోలు మరికొందరు ద్విభాషా, త్రిభాషా చిత్రాలలోనూ నటిస్తున్నారు. సో… ఇవాళ తెలుగులో తెరకెక్కుతునన్ని పాన్ ఇండియా చిత్రాలు మరే భాషల్లోనూ రావడం లేదు. ఇది వాస్తవం. తెలుగు సినిమా రంగం గర్వించాల్సిన విషయం.

Show comments