Nani:న్యాచురల్ స్టార్ నాని ఇటీవలే అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత నాని నటిస్తున్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. ఈ సినిమాలో నాని ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక తాజాగా నాని.. శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశాడు.
ఇక ఈ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ ” మరో ఆరు నెలలు మీడియా ముందు కనపడకూడదనుకున్నాను. అల్లూరి వలన ఇలా కలిశాను. ట్రైలర్ చాలా బావుంది. కొత్త విష్ణు కనిపించాడు. ఇప్పటివరకు శ్రీ విష్ణు సాఫ్ట్ హీరోగా కనిపించాడు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ గా మెప్పించాడు. అందరి ముందు ఇలా సైలెంట్ గా కనిపించే శ్రీ విష్ణు మీకు తెలుసు.. కానీ అతనిలో వేరే యాంగిల్.. విశ్వరూపం నేను అంటే సుందరానికి ప్రమోషన్స్ లో చూశాను. పైకి కామ్ గా ఉంటూ లోపల యాక్టివ్ గా ఉండే వ్యక్తిగా మహేష్ బాబు ను చూశాను. ఇప్పుడు శ్రీ విష్ణు. ఆయనంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో సినిమాలాను ప్రేక్షకులు చూడడం లేదు.. థియేటర్స్ కు ప్రేక్షకులు రావడం లేదు అని విన్నాను. అలాంటిదేమి లేదు. ప్రేక్షకులు ఎప్పుడు సినిమాలు చూస్తారు. ఎప్పుడు మంచి సినిమాలను ఆదరిస్తారు. గత రెండు నెలల్లో వచ్చిన సినిమాలే అందుకు ఉదాహరణ. ఈ సినిమా కూడా ఆ సక్సెస్ ను కొనసాగించాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.