నందమూరి తారకరత్న ప్రస్తుతం క్రిష్ షో రన్నర్ గా వ్యవహరిస్తున్న ‘9 అవర్స్’ అనే వెబ్ సీరిస్ లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. జూన్ 2 నుండి ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అలానే అతను నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘సారథి’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మరికొన్ని సినిమాలలోనూ తారకరత్న నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న మహేశ్ బాబు, త్రివిక్రమ్ మూవీలో తారకరత్న విలన్ నటించబోతున్నాడంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
తారకరత్న పేరుతోనే ఈ వార్త ట్వీట్ కావడంతో అందులో నిజముందని నందమూరి అభిమానులు భావించి, అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దాంతో ఈ విషయమై తారకరత్న పెదవి విప్పాడు. ‘తనకు ఎలాంటి ట్విట్టర్ ఖాతా లేదని, ఎవరో ఫేక్ ఖాతా తెరచి తన పేరుతో ట్వీట్స్ చేస్తున్నారని, అలాంటి వార్తల్ని నమ్మొద్ద’ని నందమూరి తారకరత్న తెలియజేశాడు. ఈ విషయంపై గతంలో కూడా తారకరత్న పేస్ బుక్ ఖాతా ద్వారా వివరణ ఇచ్చాడు. “నాకు సంబందించి ఏ విషయం అయిన నా పీఆర్ టీం నుంచి సమాచారం అందుతుంది. దయచేసి ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు” అని నందమూరి తారకరత్న కోరారు.