‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన బాలకృష్ణ, బోయపాటి కాంబో… ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ‘అఖండ’తోనూ అదే పని చేయబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్స్ కు సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక అఘోరగా బాలకృష్ణ గెటప్ అదరహో అన్నట్టుగా ఉంది. ఆ గెటప్ మీద చిత్రీకరించిన ‘భం అఖండ, భం భం అఖండ’ అనే టైటిల్ సాంగ్ పూర్తి లిరికల్ వీడియోను కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ వీడియో వైరల్ గా మారింది. అనంత శ్రీరామ్ రాసిన ఈ గీతాన్ని తన కుమారులు సిద్ధార్థ్, శివమ్ తో కలిసి శంకర్ మహదేవన్ అద్భతంగా గానం చేశారు. ఇక సంగీత దర్శకుడిగా టాప్ పొజిషన్ ను ఎంజాయ్ చేస్తున్న ఎస్. ఎస్. తమన్ రోమాంచితమైన బాణీని ఈ పాట కోసం కంపోజ్ చేశారు. చిత్రీకరణ సైతం అదే తరహాలో సాగిందనేది ఈ లిరికల్ వీడియో మధ్యలో మెరుపులా వచ్చిన మేకింగ్ విజువల్స్ చూస్తుంటే అర్థమౌతోంది. ‘సింహా, లెజెండ్’ విజయాలను మరిపించేలా ‘అఖండ’ను తెరకెక్కించడానికి బోయపాటి పడుతున్న శ్రమ ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ‘అఖండ’ చిత్రం విడుదల తేదీని అతి త్వరలోనే నిర్మాత మిర్యాల రవీందర్ తెలియచేస్తారని బాలయ్య బాబు అభిమానులంతా భావిస్తున్నారు. ఆ శుభ ముహూర్తం కోసం వేచి చూస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ నాయికగా నటించిన ‘అఖండ’లో శ్రీకాంత్ ఓ కీలకమైన పాత్రను పోషించాడు.