యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘లక్ష్య’ చిత్రం డిసెంబర్ రెండో వారంతో థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ బరిలో సరిగా టార్గెట్ రీచ్ కాలేకపోయిన ఈ సినిమా ఆహాలో మాత్రం వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నెల 7వ తేదీ నుండి ‘లక్ష్య’ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి నాలుగు రోజుల్లోనే పది కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను ఈ సినిమా రీచ్ అయ్యింది. ఈ విషయాన్ని ఆహా సంస్థ ప్రతినిధులు తెలియచేస్తూ, ‘నాగశౌర్య నటించిన ఈ స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ డ్రామాకు మంచి స్పందన లభిస్తోంది” అని అన్నారు.
ధర్మేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం అయిన ఈ సినిమాలో నాగశౌర్య సరసన కేతిక శర్మ నాయికగా నటించింది. కాలభైరవ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో జగపతిబాబు కీలకపాత్ర పోషించాడు. జీవితంలో ఎదురైన చేదు ఘటనలను తట్టుకుని ఓ విలుకాడు ఎలా విజయపథంలో సాగాడన్నదే ఈ చిత్ర కథ. విశేషం ఏమంటే ఇటీవలే నాగశౌర్య నటించిన మరో చిత్రం ‘వరుడు కావలెను’ సైతం జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది.