Nagarjuna The Ghost Film Completed Censor Formalities: దసరా కానుకగా అక్టోబర్ 5న రాబోతున్న కింగ్ నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీ సైతం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుంది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాయికగా నటించిన సోనాలి చౌహాన్ శనివారం మీడియాతో ముచ్చటించింది.
ఈ యేడాది విడుదలైన ‘ఎఫ్3’ లో క్యామియో రోల్ చేసిన సోనాలీ చౌహన్ తన తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ గురించి చెబుతూ, ”కోవిడ్ కారణంగా మొత్తం ఇండస్ట్రీనే విరామం తీసుకుంది. హిందీలో కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అయితే తెలుగు నా ఫస్ట్ లవ్. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ కథ చెప్పినపుడు చాలా థ్రిల్ అనిపించింది. నాగార్జున గారు ఈ ప్రాజెక్ట్ వున్నారని తెలిసి ఎక్సయిట్ అయ్యా. ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపిస్తా. ఇది శారీరకంగా, మానసికంగా చాలా సవాల్ తో కూడుకున్న పాత్ర. ఇలాంటి పాత్ర చేయడం నా కెరీర్ లో ఇదే మొదటిసారి. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. యాక్షన్ తో పాటు ఎంఎంఎ శిక్షణ పొందాను. అయితే శిక్షణలో రెండో రోజే నా కాలివేలు ఫ్రాక్చర్ అయ్యింది. చిన్న గాయమే అనుకున్నాను. డాక్టర్ దగ్గరికి వెళితే ఎక్స్ రే తీయమని చెప్పారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని మళ్ళీ శిక్షణలోకి వచ్చాను. మా నాన్న పోలీస్ ఆఫీసర్ కావడం వలన గన్స్ తో నాకు పరిచయం వుంది. అయితే ఈ సినిమా కోసం ఏకే 47 లాంటి పెద్ద వెపన్స్ ని పట్టుకోవడం, లోడ్ చేయడం, వాటిని హ్యాండిల్ చేయడంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. దాదాపు రెండు నెలలు ఇది సాగింది. అలాగే డైలాగ్ డిక్షన్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ఒక నటిగా చాలా తృప్తిని ఇచ్చిన చిత్రమిది. షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాను. ఒక డ్రీమ్ టీంతో కలసి పని చేయడం గొప్ప ఆనందం ఇచ్చింది. నిజంగా ఇందులో నా పాత్ర ఒక డ్రీమ్ రోల్. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. సినిమా చూసిన తర్వాత కేవలం గ్లామరస్ పాత్రలోనే కాకుండా వైవిధ్యమైన పాత్రలు చేయగలనే నమ్మకం కుదురుతుందని భావిస్తున్నాను” అని తెలిపింది.
నాగార్జునతో కలిసి పనిచేయడం గురించి చెబుతూ, ”నాగార్జున గారితో పని చేయడం ఒక డ్రీమ్. ఆ కల ఈ సినిమాతో తీరింది. నాగార్జున గారికి నేను పెద్ద అభిమానిని. ఆయన్ని కలసినప్పుడు కాస్త నెర్వస్ గా ఫీలయ్యా. అయితే పది నిమిషాల మాట్లాడిన తర్వాత నా భయం అంతా పోయింది. నాగార్జున చాలా గ్రేట్ పర్శన్. ఆయనతో నటించడం మర్చిపోలేని అనుభూతి. నాగార్జున గారు కింగ్ అఫ్ రొమాన్స్. ‘వేగం…’ పాటలో మా కెమిస్ట్రీ చూసేవుంటారు. నిజానికి నాగార్జున గారితో పూర్తి స్థాయిలో మంచి రొమాంటిక్ సినిమా చేయాలని వుంది” అని చెప్పింది.
తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ, ”నాకు ఎలాంటి సినిమా నేపధ్యం లేదు. చాలా సాంప్రదాయ రాజ్ పుత్ కుటుంబం నుండి వచ్చాను. యాక్టింగ్ మాట పక్కన పెడితే మాకు ఇంటి నుండి బయటికి రావడమే గొప్ప. నాకు ఏమీ తెలియని రోజుల్లో ఇండస్ట్రీకి వచ్చాను. ప్రతిది ఇక్కడే నేర్చుకున్నాను. జీవితంలో ఎత్తుపల్లాలు వుంటాయి. వాటిని ఎలా తీసుకోవాలో కూడా ఇండస్ట్రీనే నేర్పింది. రెండు సినిమాలు చర్చల్లో వున్నాయి. త్వరలోనే వివరాలు తెలుస్తాయి” అని తెలిపింది.