గత యేడాది కేవలం ‘లవ్ స్టోరీ’ మూవీతో సరిపెట్టుకున్న అక్కినేని నాగచైతన్య ఈ సంవత్సరం మాత్రం మూడు చిత్రాలతో సందడి చేయబోతున్నాడు. అన్నీ అనుకూలిస్తే మరో సినిమా కూడా విడుదల కాకపోదు. ఈ యేడాది సంక్రాంతి కానుకగా నాగచైతన్య, తన తండ్రి నాగార్జునతో కలిసి నటించిన ‘బంగార్రాజు’ మూవీ విడుదలై, మోడరేట్ హిట్ గా పేరు తెచ్చుకుంది. ఇక తొలిసారి నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో చైతు ఓ కీలక పాత్ర పోషించాడు. దాంతో ఈ మూవీని తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేయాలనే నిర్ణయానికి ఆమిర్ ఖాన్ వచ్చాడు. ఈ మూవీని ఆగస్ట్ 11న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే… తాజాగా నాగచైతన్య, విక్రమ్‌కుమార్, దిల్‌రాజు కాంబినేషన్ లో తెరకెక్కతున్న ‘థాంక్యూ’ రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ అయ్యింది. ‘మనం’ లాంటి ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ తరువాత నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌కుమార్ కలయికలో ‘థాంక్యూ’ రాబోతోంది. ఈ చిత్రంలో రాశీఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్‌లుగా నటించారు. ఈ చిత్రాన్ని జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో నాగచైతన్య కూల్ అండ్ స్టయిలిష్ లుక్ అందరిని ఆకట్టుకుంటోంది. ‘నాగచైతన్య కెరీర్‌లో మరపురానిదిగా ఈ సినిమా వుంటుందని, లెజండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ మూవీకి తమన్ స్వరాలు సమకూరుస్తున్నార’ని నిర్మాతలు రాజు, శిరీష్ తెలిపారు. బీవీఎస్ రవి కథను అందించిన ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్. అలానే ఈ సినిమా తర్వాత నాగచైతన్య, తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ మూవీ చేయబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకోబోతోంది. సో… జూలై, ఆగస్ట్ మాసాల్లో బ్యాక్ టూ బ్యాక్ చైతు సినిమాలు వస్తాయన్న మాట!