Jayathi: ‘వెన్నెల’ కార్యక్రమంతో వీజేగా చక్కని గుర్తింపు తెచ్చుకుంది జయతి. ఆ తర్వాత కొంత గ్యాప్ రావడంతో హీరోయిన్ గా నటిస్తూ ఓ సినిమాను నిర్మించింది. బట్…. ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో మరో రెండేళ్ళ పాటు జయతికి బ్రేక్ వచ్చింది. ఇప్పుడు ఆమె జనం ముందుకు ‘నా ఫ్రెండ్ దేమో పెళ్ళి’ అనే వీడియో ఆల్బమ్ లో వచ్చింది. నివృతి వైబ్స్ ద్వారా జనంలోకి వెళ్ళబోతున్న ఈ వీడియో సాంగ్ ను ప్రముఖ నటుడు జెడీ చక్రవర్తి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, “నివృతి అంటే సంతోషం అని అర్థం. జయతి గ్యాప్ తీసుకోవడం వల్లే ఈ పాట చేయగలిగింది. పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని కాకుండా.. డ్యాన్స్ చేస్తున్న జయతిని చూడటమే విశేషం. భీమ్స్, కాసర్ల శ్యాంలకు పెళ్లి అయింది కాబట్టి అంత కసిగా కొట్టారు. ఈ పాట పెద్ద హిట్ అయి.. పెళ్లి జరిగితే అయ్యే లొల్లి ఏంటో పార్ట్ 2గా తీయాలని కోరుకుంటున్నాను. ఒక్క పాట కోసం ఇంతగా ఖర్చు పెడతారా? అని అనుకున్నాను. ఖర్చు పెడితే కూడా డబ్బులు వెనక్కి వస్తాయని వారి లాజిక్. ఇక్కడకు నన్ను పిలిచినందుకు నివృతి వైబ్స్‌కు థాంక్స్” అని అన్నారు.
జయతి మాట్లాడుతూ, “గత నెలలో నివృతి వైబ్స్ నుంచి ఓ పాట వచ్చింది. ఆ ఈవెంట్‌కు నేను గెస్టుగా వచ్చాను. ఇప్పుడీ పాట లాంచ్ చేయడానికి పిలిచిన వెంటనే వచ్చిన జేడీ గారికి థాంక్స్. ఈ పాటకు భీమ్స్ చక్కని స్వరాలు ఇవ్వగా, కాసర్ల శ్యామ్ మంచి లిరిక్ అందించారు. శ్రావణ భార్గవి చక్కగా పాడారు. ఈ పాటను ఎవరి ద్వారా విడుదల చేయాలని అనుకున్నాను. అప్పుడే నాకు నివృతి వైబ్స్, ప్రియా గారు పరిచయం అయ్యారు. ఈ పాటను ఇంత గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నందుకు ప్రియా గారికి థాంక్స్. ‘లచ్చి’ సినిమాలో రామ్ ప్రసాద్‌తో కలిసి నటించాను. ఈ పాట కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు. నటుడు రాం ప్రసాద్ మాట్లాడుతూ, “నివృతి వైబ్స్‌కు థాంక్స్ చెప్పుకోవాల్సిందే. సినిమా పాటలకు ధీటుగా తీస్తున్నారు. జయతి గారు వెన్నెల ప్రోగ్రాంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఈ పాట నాకు చాలా నచ్చింది. జయతి గారికి ఈ పాట రీ లాంచ్‌లా ఉండాలి. నా మొదటి సినిమా ‘జోష్’. అందులోనే జేడీ గారితో పరిచయం ఏర్పడింది. ఈ పాటను అందరూ చూసి విజయవంతం చేయండి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ షష్టి, బాలు, ఆక్సాఖాన్ తదితరులు పాల్గొన్నారు.